వారు చేయరు పవన్.. తమరే పూనుకోవాలి!

సుగాలి ప్రీతి వ్యవహారాన్ని రాజకీయం వాడుకోవాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్! చాలా కాలం కిందట ఓసారి ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. అప్పట్లో తాను ఎవరి పల్లకీ అయితే మోస్తూ ఉన్నాడో అదే…

సుగాలి ప్రీతి వ్యవహారాన్ని రాజకీయం వాడుకోవాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్! చాలా కాలం కిందట ఓసారి ఆయన ఈ అంశం గురించి మాట్లాడారు. అప్పట్లో తాను ఎవరి పల్లకీ అయితే మోస్తూ ఉన్నాడో అదే తెలుగుదేశం పార్టీ అధికారం చెలాయిస్తున్నప్పటికీ.. కర్నూలు రోడ్లలో కాస్త సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు తప్ప.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. తీరా ఇప్పుడు మళ్లీ ఆ అంశాన్ని నెత్తికెత్తుకుని.. సీబీఐ కి ఈ కేసును అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ బుధవారం కర్నూలులో పర్యటించారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే అన్నారు. దిశ కేసులో అంతగా గట్టిగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుగాలి ప్రీతి విషయంలో మాత్రం.. ఎందుకంత ఉదాసీనంగా ఉన్నదో అర్థం కావడం లేదని ఆయన దుమ్మెత్తిపోశారు. అంతా బాగానే ఉంది. స్థానిక అధికారులు న్యాయం చేయాలని ఉన్నప్పటికీ.. స్థానిక నేతలు అడ్డుపడుతున్నారని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. ఒత్తిడి చేస్తున్న నేతలు ఎవరో.. వారి పేర్లు చెప్పి బాహాటంగా దుమ్మెత్తిపోయడానికి వెనకాడని పవన్ ఈ విషయంలో మాత్రం.. ఇంతజాగ్రత్తగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని సంగతి.

ఇదంతా పక్కన పెడితే.. కర్నూలులో బహిరంగ సభావేదికమీదినుంచి.. పవన్ కల్యాణ్ ఓ హెచ్చరిక కూడా చేశారు. ప్రభుత్వం గనుక వెంటనే స్పందించి.. ఈ కేసును సీబీఐ కు అప్పగించకపోతే.. తాను మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రభుత్వ స్పందన రాకుంటే.. కర్నూలులో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని కూడా ప్రకటించారు.

అయితే పవన్ కల్యాణ్ గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రభుత్వాన్ని డిమాండు చేయడమూ.. మీరు స్పందించకపోతే దీక్ష చేస్తా అంటూ బెదిరించడమూ అనవసరం. దీక్ష చేసినా కూడా మళ్లీ అది ప్రభుత్వ స్పందనకోసమే తప్ప సమస్యకు పరిష్కారం కాదు. పవన్ కల్యాణ్ కు సుగాలి ప్రీతి విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. మానవ హక్కులకమిషన్ కు ఫిర్యాదు ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంటే.. ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షించకుండా.. ఆ పని  చేయవచ్చు. వారి ద్వారా సీబీఐ కేసు తీసుకునేలా పవన్ కల్యాణ్ పూనిక వహిస్తే గనుక.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. తాను న్యాయం చేయించానని ఆయనే మైలేజీ తెచ్చుకోవచ్చు. అంతే తప్ప.. జగన్ సర్కారును.. మీరు స్పందించండి.. లేకపోతే అది చేస్తా.. ఇది చేస్తా అంటూ బెదిరించడం అనవసరం.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ