వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పాలనను సంస్కరణల పథంలోనే నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదివరకే వీఐపీ ప్రత్యేక దర్శనాల టోకెన్లను బ్లాకుమార్కెట్లో అమ్ముకునే దళార్లకు చెక్ పెడుతూ.. శ్రీవాణి పథకానికి విరాళాలు ఇచ్చిన వారికి వీఐపీ హోదా ఇచ్చే పద్ధతి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా మంది దళారీలకు పనిలేకుండా చేసిన, పైరవీలకు చెక్ పెట్టిన నిర్ణయం అది. ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు.
తిరుమలేశుని ప్రసాదాల్లో లడ్డూకు అపరిమితమైన ఆదరణ ఉంటుంది. అందులోనూ కల్యాణోత్సవం లడ్డూ (పెద్ద లడ్డూ) అంటే వీఐపీలకు అదొక మక్కువ. దానికి తోడు.. సదరు పెద్దలడ్డూ అనేది.. కేవలం సిఫారసు ఉత్తరాలకు మాత్రమే దొరుకుతుంది. అంటే కేవలం పైరవీలు చేసుకోగలిగిన వారికి మాత్రమే అన్నమాట. దాన్ని అడ్డుగా పెట్టుకుని దళార్లు యథేచ్ఛగా చెలరేగుతుండేవారు. ఈ విషయంలో కూడా టీటీడీ పాలకమండలి శెభాషైన నిర్ణయం తీసుకుంది.
ఇక మీదట కల్యాణోత్సవం లడ్డూలను కూడా.. భక్తులకు ఎన్ని కావలిస్తే అన్ని.. లడ్డూ కౌంటర్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ లడ్డూ ఒక్కొక్కటి 200 రూపాయల ధరకు విక్రయిస్తారు. లడ్డూల విషయంలో ఇదివరకే వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. సాధారణ లడ్డూలకు యాభై రూపాయల ధర నిర్ణయించి.. భక్తులకు ఎన్ని కావలిస్తే అన్ని లడ్డూలు ఇచ్చేలా నిబంధనలను మార్చేశారు. దీంతో సగం పైరవీలు తగ్గిపోయాయి. దళార్లకు పెద్దలడ్డూ మిగిలింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో దానికి కూడా చెక్ పడినట్టే.
సిఫార్సులతో అవసరం లేకుండా లడ్డు కౌంటర్లలో రూ. 200 ధరతో పెద్ద లడ్డుల విక్రయం బుధవారం ప్రారంభించారు. పదివేల లడ్డూల స్టాక్ తో ప్రయోగాత్మకంగా విక్రయిస్తున్నారు. ఇలాంటి సంస్కరణలు మరిన్ని చోటుచేసుకుంటే.. తిరుమలలో అన్ని రకాల పైరవీకార్లకు చెక్ పెట్టినట్టు అవుతుంది.