బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సీఎం జగన్మోహన రెడ్డి.. చాలా అంశాలపై మంతనాలు సాగించారు. సుమారు గంటన్నరకు పైగా ప్రధానితో గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను నివేదించారు. వీటిలో చాలా డిమాండ్లు ఉన్నాయి. అయితే.. విశ్లేషకులు ఈ వార్తలను గమనిస్తున్న దాన్ని బట్టి.. ప్రధానితో జగన్ చేసిన ప్రధాన డిమాండ్ పేదల ఇళ్లకు సంబంధించినదే.
ఉగాది నాడు రాష్ట్రంలో పాతిక లక్షల మంది పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. చారిత్రాత్మకమైన ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని జగన్ ఆహ్వానించడం ఈ భేటీలో హైలైట్. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో… అదే సమయంలో ఆ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చేందుకు ప్రధానిని ఆహ్వానిస్తున్నారో అర్థమవుతోంది. ఇదే ఇంటిస్థలాలకు సంబంధించి జగన్ తన చిత్తశుద్ధిని మరో రీతిగా కూడా నిరూపించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పుభూములు అంటూ సుమారు 800 ఎకరాల స్థలం ఉంది. కేంద్ర ప్రభుత్వఆధీనంలో ఉండే ఆ స్థలాలు ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నాయి. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా జ గన్ ప్రధానిని కోరారు. పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ఆ స్థలాన్ని వినియోగిస్తామని అన్నారు. ఈ విషయంలో జగన్ ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రత్యేకహోదా దగ్గరినుంచి, విభజనానంతర పెండింగ్ సమస్యలు, రెవెన్యూలోటు ను భర్తీ చేయడం తదితర అనేక అంశాలను కూడా జ గన్ ప్రధాని వద్ద ప్రస్తావించినట్లుగా, విన్నవించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ కూడా ఒక పట్టాన కొలిక్కి వచ్చే వ్యవహారాలు కాదు. హోదాకు సంబంధించినంత వరకు జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. అడుగుతూ ఉండాల్సిందే తప్ప.. వచ్చేది కాదు. కానీ.. ఈ భేటీ పర్యవసానంగా ఉప్పుభూములను రాష్ట్రానికి సాధించినా, ఆమేరకు పేదలకు ఇంటిపట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రధాని వచ్చినా.. అది జగన్ ఘనవిజయంకిందనే చెప్పుకోవాలి.