పవన్‌కు రాయలసీమ ప్రజలంటే ఎందుకంత కోపమో అర్థం కాదు. బహుశా తాము పుట్టిపెరిగిన ఊళ్లో అన్న చిరంజీవిని ఓడించి, తిరుపతిలో గెలిపించారని కాబోలు. రాయలసీమతో పాటు సీఎం జగన్‌పై విషం కక్కడానికి ఆయన ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఇందుకు నిన్న కర్నూల్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యటనే నిదర్శనం.
సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు శిక్ష విధించాలని కోరుతూ బుధవారం కర్నూల్‌లో ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం కర్నూల్‌లో న్యాయ రాజధాని (జ్యుడిషియల్ కాపిటల్) అంటోంది. అలాంటి న్యాయ రాజధానిలో అత్యాచారం జరిగి చనిపోయిన బాలిక కుటుంబానికి ఏళ్లు గుడుస్తున్నా న్యాయం జరగనప్పుడు ప్రయోజనం ఏంటి?’ అని ప్రశ్నించాడు.
అసలు ఈ ఘటన 2017లో పవన్ బాస్ చంద్రబాబు పాలనలోనే చోటు చేసుకొంది. అప్పుడు ఏ మాత్రం నోరెత్తని పవన్…తనంటే నచ్చని జగన్ సీఎం అధికారంలో ఉన్నాడనే కర్నూల్‌కు వచ్చాడు. ఇలాంటి ఘటనలు ఎవరి పాలనలో జరిగినా ఖండించాల్సిందే. దోషులకు కఠిన శిక్ష విధించి మరోసారి పునరావృతం కాకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై జగన్ సర్కార్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు చర్యలు తీసుకుంటోంది. ప్రీతి కేసు వివరాలను కర్నూల్ ఎస్పీ డీజీపీకి పంపారు. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి నేడో, రేపో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో పవన్ కర్నూల్ వచ్చాడు. ప్రీతికి న్యాయ జరగనప్పుడు కర్నూల్‌కు న్యాయ రాజధాని ఎందుకు అని ప్రశ్నిం చాడు. ఏదో ఒక సాకు చెప్పి అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని పవన్ చెప్పదలుచుకున్నాడా? వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమపై పవన్‌కు ఎందుకంత కోపం? జగన్‌పై కోపాన్ని సీమ ప్రజలపై పవన్ తీర్చుకుంటున్నట్టుగా ఉంది. రాజధానిలో ఏం జరిగినా, జరగకపోయినా అమరావతిలోనే అన్నీ ఉండాలనే పవన్ డిమాండ్ వెనుక ఉద్దేశం ఏంటి?
ఒకవైపు కర్నూల్‌లో హైకోర్టు పెట్టడానికి అభ్యంతరం లేదని చెబుతూనే, మరోవైపు పెడితే ఏం ప్రయోజనం అని ప్రశ్నించడం ఏంటో కనీసం పవన్‌కైనా అర్థమవుతోందా? ఇదెక్కడి ‘న్యాయం’ పవన్?