దేశంలో ఎక్కడున్నా తమకు నచ్చిన వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా తెలిపాడు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్టు ఆయన చెప్పాడు. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీ సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎన్నికల కమిషన్ సభ్యులు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపాడు.
ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే మాత్రం దేశ ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. జీవనోపాధి కోసం స్వస్థలం వీడి ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు…తాము ఉంటున్న ప్రాంతం నుంచి ఓటు వేసే అవకాశం దక్కుతుంది.
అలాగని ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఓటు వేయడం కాదు. తాము ఉంటున్న ప్రాంతంలో తప్పని సరిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సిందే. అయితే సాంకేతికంగా ఈ ప్రక్రియ విజయవంతమైనా, అమల్లోకి రావాలంటే మాత్రం చట్టంలో మార్పు తీసుకురావాల్సి ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపాడు.
భవిష్యత్‌లో మరిన్నిఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తుందన్నాడు. అయ్యా సునీల్ గారూ, త్వరగా మీరు చెప్పిన మార్పు తీసుకొస్తే చాలు…వేలాది మందికి ఇబ్బందులు తొలగించిన వారవుతారు. బ్బాబ్బాబు…ముందు ఆ సంస్కరణ తీసుకు రాండయ్యా!