ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ విడాకుల వ్యవహారం భారీ స్థాయిలో ఉన్నట్టుంది. ఐదు నెలల కిందట తన భార్య కైలీ నుంచి విడిపోయాడట క్లార్క్. తాజాగా వారి విడాకులు ధ్రువీకరణ అయినట్టుగా ఇంగ్లిష్ మీడియా చెబుతూ ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో క్లార్కీ కూడా ఒకడిగా గుర్తింపు పొందాడు. క్రికెట్ లో ఆస్ట్రేలియా ఏకఛత్రాదిపత్యపు చివరి రోజుల కెప్టెన్ కూడా క్లార్కీనే.
క్లార్క్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా ఒక వన్డే ప్రపంచకప్ ను కూడా నెగ్గింది. అంత దూకుడైన ఆటగాడు కాకపోయినా… డేంజరస్ ప్లేయర్ గా క్లార్కీకి పేరుంది. ఇలాంటి నేపథ్యంలో క్లార్క్ విడాకులు వార్తల్లోని అంశాలు అవుతున్నాయి. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. విడాకుల కోసం క్లార్క్ తన భార్యకు అత్యంత భారీ పరిహారాన్ని అందించినట్టుగా వార్తలు వస్తూ ఉండటం. విడాకులతో పాటు కైలీకి క్లార్క్ దాదాపు 280 కోట్ల రూపాయల స్థాయి పరిహారాన్ని ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది!
టీవీ యాంకర్ అయిన కైలీని క్లార్క్ ఏడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. విడాకుల అనంతరం కూతురు పెంపకాన్నీ వీరిద్దరూ చూసుకోనున్నారని, మాజీ అవుతున్న భార్యకు మాత్రం ఏకంగా 280 కోట్ల రూపాయల స్థాయి పరిహారాన్ని క్లార్క్ చెల్లించనున్నాడని ఆస్ట్రేలియన్-బ్రిటీష్ మీడియా ప్రముఖంగా పేర్కొంటున్నాయి.