కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్న తనివి తీరదు. తిరుమల కొండపై అడుగు పెట్టినప్పటి నుంచి గోవింద నామ స్మరణ మనసుల్ని వశపరచుకుంటుంది. ఆ ఆధ్యాత్మిక క్షేత్రంలో కలియ తిరగడం ఎంతో అదృష్టింగా భక్తులు భావిస్తుంటారు. తిరుమలకు వెళ్లినప్పుడు ఒకటికి రెండుసార్లు దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు.
ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి సంబంధించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవిందుడి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. దర్శనం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇకపై ఏడాదికి ఒకసారి మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెంకయ్యనాయుడు వెల్లడించడం విశేషం. శ్రీవారి సన్నిధిలో ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదని ఆయన సూచించారు. రాజకీయాలపై మాట్లాడకూదని ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆయన రాజకీయాలపై నేరుగా మాట్లాడని సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు మొదటి నుంచి బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయన అనర్ఘళంగా మాట్లాడగలరు. అందుకే ఆయన మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. మోదీ కేబినెట్లో మంత్రిగా పని చేస్తున్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపారు. పదవీ విరమణ తర్వాత సామాజిక కార్యకలాపాల్లో ఆయన పాల్గొంటున్నారు.