జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే టీడీపీ శ్రేణులకు ఉక్కపోత తప్పడం లేదు. అధికారం లేని రాజకీయ జీవితాన్ని వాళ్లు భరించలేకున్నారు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్, మరికొందరు మాజీ మంత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేయడం మొదలు పెట్టింది.
తాజాగా ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేయాలని టీడీపీ నిర్ణయించుకొంది. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అస్తవ్యస్త పరిపాలనను జనంలోకి తీసుకెళ్లేందుకు 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి రేషన్‌కార్డులు, పింఛన్ల తొలగింపు, ఇసుక ధరల పెంపుతో పాటు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను వివరించనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. మొత్తం 45 రోజుల పాటు అన్ని గ్రామాలు, వార్డుల్లో చైతన్యయాత్రలు నిర్వహించనున్నారు.
కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది ప్రజాచైతన్య యాత్రలు కాదు. ఆయన కాశీ యాత్రలు చేయాల్సిన వయసులో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు కాబట్టే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు కట్టబెట్టారు. ప్రజల చైతన్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. గత ఐదేళ్లలో తామేమి చేసినా ప్రజలు చూడరనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడింది. ఇసుక , మట్టి దోపిడీ, రైతుల రుణమాఫీకి కట్టుబడని వైనం…ఇలా అనేకం.
హామీల అమల్లో మోసకారితనం, మాయ మాటలు, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ అరాచకాలు, ఇలా ఒకటేమిటి…అన్ని రకాల అప్రజాస్వామిక విధానాలకు గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ వాస్తవాన్ని విస్మరించి…ఇప్పుడు ప్రజాచైతన్యయాత్రల పేరుతో, ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి పోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రజల నుంచి చైతన్యం పొందడానికైతే అభ్యంతరం లేదు కానీ, ప్రజల్ని చైతన్యపరచడానికి అంటే మాత్రం అంతకంటే హాస్యం మరొకటి లేదు. కాశీ యాత్ర చేయడానికి ప్రజలు చంద్రబాబుకు తగినంత సమయం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.