తప్పు చేయడం తప్పు కాదు. తప్పును సరిదిద్దుకోక పోవడమే తప్పిదమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా విధానాలను, నడవడికను మార్చుకుంటూ ఉంటారు. అలాంటి నాయకులను విజ్ఞులు అంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించే, మాట్లాడేవారిని అహంకారులు, హిట్లర్లని అంటారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రెండో జాబితాలో చేరారు.
టీడీపీని ఓడించి ప్రజలు తప్పు చేశారంటున్నారాయన. బాబు నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విన్న టీడీపీ నేతలు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. విజయవాడలోని కానూరు అన్నేవారి కల్యాణ మండపంలో మంగళవారం టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ…
‘ప్రజలు అప్పుడప్పుడూ తప్పు చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారి ప్రలోభాలకు లొంగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలబడితే అభినందిస్తున్నారు. ఇటీవల మండలిలో అలా నిలబడిన ఎమ్మెల్సీలను ప్రశంసించారు. కానీ, తమ వద్దకు వచ్చేసరికి ప్రజలు అప్పుడప్పుడు రూ.వెయ్యి, రెండు వేల ప్రలోభాలకు లొంగిపోయి తప్పు చేస్తున్నారు. దీనిపై చర్చ జరగాలి’ అని అన్నారు.
తన ఐదేళ్ల పాలన ప్రజల మనసులను ఎందుకు గెలుచుకోలేక పోయిందో ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులు , తిరిగి వారిపైనే నిందలా? టీడీపీని ఓడించి ప్రజలు తప్పు చేశారంటున్నారంటే బాబుకు పిచ్చి పీక్స్టేజ్కు వెళ్లిపోయినట్టుంది. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని ఈ విధంగా నిందించిన రాజకీయ నేతలెవరూ ఉండరేమో. బాబు వినాశనానికి ఈ ఒక్క తప్పు చాలు.
ఓటుకు నోటు పంపిణీకి ఆద్యుడు చంద్రబాబే అని జగమెరిగిన సత్యం. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పసుపు-కుంకుమ పేరుతో ఒకొక్కరికీ రూ.10 వేలు చొప్పున ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేసింది చంద్రబాబు సర్కార్ కాదా? బాబు ప్రలోభాలకు ఏ మాత్రం లొంగకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు…ఇలా అన్ని వర్గాల ప్రజలు ఓడించారనే అక్కసుతో బాబు ప్రజల్ని నిందిస్తున్నారనుకోవాలా? మొత్తానికి తనను ఓడించి ప్రజలే తప్పు చేశారనేంత పెద్ద మాట అంటున్నారంటే, ఇంతకంటే ఆయన అహంకారానికి నిదర్శనం ఏమి ఉంటుంది? ప్రజలపై వేసిన ఈ నింద ఒక్కటీ చాలు బాబుకు జన్మలో ఓట్లు వేయవద్దని నిర్ణయించుకునేందుకు!