ఏ మతం గురించి చర్చిద్దామన్నా ముందు దాని కర్మకాండ అడ్డుపడుతుంది. చాలా మతాల మౌలిక సూత్రాలు ఒకటే. అయితే దేశకాల, సామాజిక పరిస్థితుల బట్టి ఆచారం, కర్మకాండ ఏర్పడతాయి. ఇక అసలుది వదిలేసి అవే పట్టుకుని అదే మతం అనుకుని దాని సమర్థించేవాళ్లు కొందరైతే, వాటి ఆధారంగా మతాన్ని విమర్శించేవాళ్లు కొందరు. మతం ఒకటే అయినా ప్రాంతం బట్టి, కులం బట్టి ఆచారం మారిపోతూ ఉంటుంది. వీటిల్లో ఏది ప్రామాణికం? మంగళసూత్రం అనేది వైదికాచారం ప్రకారం లేదని ఆర్యసమాజం వాళ్లు చెప్తారు. కొన్ని రాష్ట్రాలలో అది విధాయకం కానే కాదు. ఆచారం పాటించేవారిలో కూడా మంగళసూత్రం ఆకారం కులం బట్టి, ప్రాంతం బట్టి మారుతోంది.
అలాగే వైవాహిక మంత్రతంత్రాలు కూడా. పూర్వకాలం నుంచి మన దగ్గర గాంధర్వం, రాక్షసం కూడా వైవాహిక విధానాలుగా ఆమోదముద్ర వేయించుకున్నాయి. నేను గురువాయూరులో ఒక నాయరు మిత్రుడి పెళ్లికి హాజరయ్యాను. గుడి బయట వీధిలో వందలాది జంటలు వేచి ఉన్నాయి. అక్కడ ఎత్తుగా ఉన్న మండపం మీదకు వధూవరులను పిలిచారు. వాళ్లూ వీళ్లూ బట్టలు మార్చుకున్నారు. వరుడు మంగళసూత్రం వధువు మెళ్లో కట్టాడు. పది నిమిషాల్లో పెళ్లయిపోయింది. మర్నాడు యింట్లో వధువు చేత ఏవేవో చేయించారు కానీ మంత్రాలు లేవు. ఇటీవల మన దగ్గర అయిదురోజుల పెళ్లి చేయకపోయినా నాతిచరామి, సప్తపది లేకపోయినా వధూవరులకు శుభం కలగదని కాన్వాస్ చేసే రీతిలో సినిమాలు తయారవుతున్నాయి.
మొన్న ఓ పాఠకుడు కొందరు మహిళా ఉద్యమకారిణులు బహిష్టు సమయంలో కూడా ఆలయప్రవేశం చేస్తామంటున్నారనే అంశాన్ని లేవనెత్తారు. నాలుగో రోజున శుద్ధి అవుతుందో, ఆరో రోజున శుద్ధి అవుతుందో కూడా ప్రాంతం బట్టి మారుతుంది. చావు విషయంలో కొందర్ని పాతిపెడతారు, కొందర్ని దహనం చేస్తారు. చావు తర్వాత అశుచి ఎన్నాళ్లుంటుంది అనేది కూడా కులం బట్టి, ప్రాంతం బట్టి మారుతోంది. వీటన్నిటికి మతానికి ముడి పెట్టడం ఎలా కుదురుతుంది? ఒకే మతానికి చెందిన వారైనా గతంలో ఒక కులంలో మాత్రమే వితంతువులకు శిరోముండనం చేయించేవారు, తెల్ల బట్టలే కట్టుకోమనేవారు. రోజులు మారాయి, జుట్టు ఉంచుకోవడమే కాదు, రంగు బట్టలు కట్టుకోవడమే కాదు, బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. దానివలన మతం భ్రష్టు పట్టిపోయిందని అనగలమా? దేవుడు ఆగ్రహించాడని నిరూపించగలమా?
అంటే ఏమిటన్నమాట? ఇవేమీ మతంలో భాగం కాదు, సామాజిక పరిణామాల్లో భాగం. అంతే. శిరోముండనాన్ని ఖండించదలిస్తే ఆ సామాజిక వర్గాన్ని, అప్పటి సమాజాన్ని విమర్శించు, మొత్తం మతం గురించి మాట్లాడవలసిన పని లేదు. దేవదాసీ వ్యవస్థ నెలకొల్పమని, జోగిని ఆచారం పాటించమని హిందూమతం ఏమైనా చెప్పిందా? ఆశీర్వచనం అంటూ ముద్దులు పెట్టుకునే దొంగబాబాల పాదపూజలకు కానుకలు అర్పించుకోమని చెప్పిందా? ఇవన్నీ సాంఘిక దురాచారాలు. వాటివలన లబ్ధి పొందేవాళ్లు దేవుడి పేరు చెప్పి, ఆచారం పేరు చెప్పి అడలగొడదామని చూస్తారు. ఇలా చేయాలని ఏ పుస్తక ప్రమాణం ఆధారంగా చెప్తున్నావు? అని ఒక్క ప్రశ్న అడిగితే చాలు, ఆ వాదన వీగిపోతుంది. ఈ ఆచారాన్ని, కర్మకాండను తప్పుపట్టడంతో ఆగకుండా దాన్ని మతం యొక్క తాత్త్విక భూమికకు ముడిపెట్టి మతాన్ని నిరసించేవాళ్లు కూడా తప్పు చేస్తున్నారు.
అలాగే శాస్త్రవిజ్ఞానానికి, మతానికి ముడిపెట్టడం కూడా. ఒక దేశంలో రూపుదిద్దుకున్న సాంకేతిక ఆవిష్కరణను ఉపయోగిస్తున్నామంటే అక్కడి మతానికి మోకరిల్లుతున్నామన్నట్లు కాదు. ఎన్నో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాడుతున్నాం. వాటిని కనిపెట్టిన ఇంగ్లండు సైంటిస్టుల మతాన్ని, జపాన్ సైంటిస్టుల మతాన్ని ఆదరిస్తున్నామన్న అర్థం వస్తుందా? పంచదార, తేయాకు, సిల్కు వాడుతున్నామంటే చైనా వాళ్ల మతాన్ని నెత్తిన పెట్టుకుంటున్నామన్న భావం కలుగుతోందా? నాకు ఫలానా రోగానికి ఆయుర్వేదం మందు పని చేయలేదు, యునానీ మందు పని చేసింది అంటే, ఆయుర్వేదం పుట్టిన భారత్లోని హిందూ మతాన్ని నిరసించినట్లు, యునానీ పుట్టిన ఆనాటి గ్రీసులో ఏ మతం ఉంటే ఆ మతంలోకి మారిపోయినట్లు అర్థం వస్తుందా? ఆయుర్వేదం వాడేవాళ్లు హిందువులూ కాదు, హోమియోపతీ వాడేవాళ్లు జర్మన్ చర్చి అనుయాయులూ కాదు. అదే విధంగా యోగా కూడా! యోగా వ్యాప్తికి, హిందూమతామోదానికి సంబంధంలేదు.
యోగా ఎప్పణ్నుంచో యితర దేశాల్లో వ్యాపిస్తోంది. హీరో పాత్రధారి యోగా టీచరుగా ఉన్న 50 ఏళ్ల కిందటి బ్లాక్ అండ్ వైట్ అరబిక్ సినిమా చూశాను. ఇటీవలి కాలంలో అంటే గత 20 ఏళ్లగా యోగాకు ఆదరణ మరింత పెరిగిందంతే. దానికి, హిందూమతానికి లింకు పెట్టి హిందూమతానికి హఠాత్తుగా గౌరవం పెరిగిపోయిందనుకోవడం అవివేకం. శరీరాన్ని, మనసును నియంత్రించడం యోగా. దానిలో కొన్ని ఆసనాలకు సూర్యుడి పేరు ఉన్నా మంత్రపఠనం ఏమీ ఉండదు. యోగాకు, హిందూమతాన్ని లింకు చేసి హడావుడి చేయడంతో యోగాసనాలు వేసిన ముస్లిం మహిళను వేధించే ముస్లిం మతపెద్దలు కూడా తయారయ్యారు. 'అన్నీ యోగాలోనే ఉన్నాయిష' అని వెక్కిరించడానికి హేతువాదులూ సిద్ధమయ్యారు. జెన్ కథలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కాయి. అంత మాత్రం చేత చైనా వారి మతమో, జపాన్వారి మతమో మనం అవలంబించినట్లు అర్థం రాదు కదా. గత పాతికేళ్లగా ఫెంగ్ షూ ను నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఆ చైనా బొమ్మల్ని విపరీతంగా కొంటున్నారు. అంతమాత్రం చేత వాళ్ల కన్ఫ్యూషియస్ మతాన్నో, బౌద్ధాన్నో మనవాళ్లు నమ్ముతున్నారా?
భారతదేశంలో ఆవిష్కరించబడిన శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని హిందూమతం ఖాతాలో వేయడానికి వీల్లేదు. ఆ శాస్త్రజ్ఞులలో హిందువులు, బౌద్ధులు, జైనులు, చార్వాకులు అందరూ ఉండవచ్చు. కొందరికి దైవభావనే లేకపోయి ఉండవచ్చు. విశ్వవ్యాప్తంగా మానవాళి నిరంతరం సాంకేతిక పరిశోధనలు చేస్తూ ముందుకు సాగుతూంటుంది. దాని ఫలితాలు తమ మతస్తులకే, తమ ప్రాంతీయులకే అందాలని వారు అనుకోరు. మతం గురించి చర్చించేటప్పుడు వీటి ప్రస్తావన తేవడం అనవసరం. పెద్ద పెద్ద కట్టడాలను చూసినప్పుడు వాటి నిర్మాణ కుశలతను ఆ యా దేశాలకు వర్తింపచేసి మెచ్చుకుంటాం. కానీ అది స్థానికులే కట్టారో, లేక విదేశీయులను రప్పించి కట్టించారో మనకు తెలియదు కదా. ఏది ఏమైనా మన దేశంలో అద్భుతమైన నిర్మాణాలు చూసినపుడు భారతీయులుగా గర్విద్దాం. అది దేవాలయమైతే హైందవాన్ని, బౌద్ధారామమైతే బౌద్ధాన్ని, జైనమందిరమైతే జైనాన్ని, మసీదు అయితే ఇస్లాంను విడివిడిగా మెచ్చుకోనవసరం లేదు. ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం చూసి అబ్బురపడేటప్పుడు అర్జంటుగా ఫరావోల మతమేమిటో కనుక్కుని దాన్ని మెచ్చుకోంగా!
విశాలదృక్పథంతో గమనించినపుడు శాస్త్ర పరిజ్ఞానం అనేక దేశాల్లో పరిఢవిల్లిందని తెలుస్తుంది. అన్నీ తమ దేశంలోంచే ఎగుమతి అయ్యాయని మెసపొటేమియా వాడన్నా, చైనా వాడన్నా, ఆఖరికి భారతీయుడన్నా ఫక్కున నవ్వబుద్ధవుతుంది. నేను స్కూలులో ఉండగా చెప్పుకునేవారు – ఆటం బాంబు తయారీ విధానం మన వేదాల్లో ఉందిట. కోనసీమ నుంచి ఒక పండితుణ్ని జర్మనీవాళ్లు ఎత్తుకుపోయి, ఆయన దగ్గర్నుంచి సమస్తం నేర్చేసుకుని ఆటం బాంబు తయారు చేసేశారట. చివరి నిమిషంలో ఆ సైంటిస్టులను అమెరికాకు పట్టుకుపోయారట! నాకు ఎప్పుడూ అనుమానం వచ్చేది – కోట్లాది మంది వేదపండితులున్న భారతదేశంలో ఆ కోనసీమ పండితుడు ఒక్కడు తప్ప వేరెవరికీ ఆటంబాంబు మంత్రం రాదా? అని. ఇన్ని తరాలుగా రాజులందరూ ఒక పక్క వేదపండితులను పోషిస్తూ, మరో పక్క విల్లంబులు, కత్తులు కఠార్లూ, బల్లాలు వంటివాటిపై ఆధారపడ్డారు కానీ ఒక్కరూ అత్యాధునికమైన ఆయుధాన్ని తయారు చేయించుకోలేదేం అని.
మామూలు బాణాన్ని శస్త్రమనీ, మంత్రంతో కలిపి వేస్తే అస్త్రమని అంటారని పురాణాల్లో చదువుతాం తప్ప, చరిత్ర ప్రారంభమైన దగ్గర్నుంచి, మంత్రపూతమైన బాణాలు వేసినవారు ఒక్కరూ కనబడరు. వేదభూమి అయిన మన దేశంలోని రాజులు తుపాకీ మందు దగ్గర్నుంచి అన్నీ మ్లేచ్ఛుల నుంచి దిగుమతి చేసుకోవలసిన ఖర్మం ఎందుకు పట్టింది? టిప్పు సుల్తాన్ నాటు రాకెట్లతో కుస్తీ పట్టాడు తప్ప తన ఆంతరంగికులైన హిందువుల ద్వారా వేదపండితులతో చెప్పి అణుబాంబులను తయారు చేయించి వుంటే ఇంగ్లీషు వాళ్ల పీడ మనకు దాపురించేదే కాదు. వేదాలనేవి ఓ కాగితం మీద రాసిన సీక్రెట్ ఫార్ములా కాదు, అది పట్టుకుని కోనసీమ పండితుడు పారిపోవడానికి. అవి మౌఖికం. కేవలం పఠనం ద్వారానే ఒక తరాన్నుంచి మరొక తరానికి వారసత్వంగా వచ్చాయి. దేశమంతా వ్యాపించాయి. దాన్ని తస్కరించడమనే ఆలోచనే అర్థరహితం. ఆ మంత్రాల అంతరార్థాలపై పరిశోధనలు చేశారనవచ్చు. అది జర్మనీవాడూ చేయవచ్చు, మన దేశంలో ఉన్న వాళ్లూ చేయవచ్చు.
మనదేశంలో అనేక శాస్త్రాలు వర్ధిల్లాయి. కొన్నిటిలో మనం చాలా బాగా రాణించాం. వాటికి దాఖలాలు చూపగలుగుతాం. దాఖలాలు చూపలేని వాటి గురించి లేని గొప్పలు చెప్పడం అనవసరం. పుష్పకవిమానం గురించి పురాణాల్లో ఉంది కాబట్టి మనకు గగనయానం తెలుసు అని వాదించలేము. అలా అయితే అన్ని దేశాల పురాణాల్లో కామరూపం, అదృశ్యమయ్యే శక్తి, దూరశ్రవణం… యిలా ఎన్నో చమత్కారాలు కనబడతాయి. ఇవన్నీ ఊహలే. దేన్నయినా కనిపెట్టాలంటే ప్రప్రథమంగా ఊహ అనేది కలగాలి. ఊహ ఉన్నంత మాత్రాన కనిపెట్టేసినట్లు కాదు. పురాణాల్లోని కొన్న ఊహలు యిప్పుడు ప్రత్యక్షానుభవంలోకి వచ్చాయి. అవి పురాణాలను పూజిస్తే రాలేదు. మెట్టుమెట్టుగా ముందుకు సాగుతూ, బొట్టుబొట్టుగా మేధస్సు చిలికితే వచ్చాయి. మన దేశంలో విమానాలు విహరించాయి అని చెప్పుకునేవాళ్లు పురాణప్రసక్తి కాకుండా ఏవైనా ఆధారాలు చూపగలగాలి. కాలగతిలో చెరిగిపోయినా వాటి ఆనవాళ్లు ఉండాలి కదా.
అనేక ఆలయాల నిర్మాణం చూస్తే ఆర్కిటెక్చర్లో, గ్రహసంచారాన్ని లెక్కించడంలో మనవాళ్ల విజ్ఞానం అడుగడుగునా ద్యోతకమౌతుంది. అలాటివి తక్కిన విషయాల్లో కనబడినప్పుడే మనకు నమ్మబుద్ధవుతుంది. ఇబ్బందేమిటంటే ప్రశ్నలు వేస్తే దేశభక్తి లేదంటున్నారు. మధ్యలో మతాన్ని యీడ్చుకుని వచ్చి హైందవద్రోహి అంటున్నారు. ఈ ధోరణి పోవాలి. మరుగున పడిన విజ్ఞానాన్ని బయటకు తేవాలి. ఖాళీలను పూరించాలి. దాన్ని ఆధునికతకు జోడించాలి. మన ఆచారాలను, సంప్రదాయాలను ఏకమొత్తంగా తిరస్కరించే బదులు, ఒక్కోదాన్ని పట్టి చూసి, అది ఎలా ప్రారంభమై ఉంటుందో ఊహించి, ఆ పరిస్థితులు యిప్పటికి కూడా అన్వయిస్తామో పరిశీలించి చెప్పాలి. చాలామందికి తెలిసున్న కథే యిక్కడ చెప్పడం సందర్భోచితం. ఒకరింట్లో పెంపుడు పిల్లి ఉండేది. ఇంట్లో శ్రాద్ధకర్మ జరిగే రోజున అది వచ్చి పిండాలను తినేస్తుందేమోనన్న భయంతో దాన్ని ఒక రోటికి కట్టేసి పెట్టేవారు. ఇంట్లో చిన్నపిల్లవాడి కళ్లలో ఆ దృశ్యం పడిపోయింది. అతను పెరిగి పెద్దవాడయ్యేసరికి యింట్లో పెంపుడు పిల్లి లేదు. అయినా శ్రాద్ధకర్మ రోజున ఎక్కణ్నుంచో ఓ పిల్లిని తెచ్చి రోటికి కట్టేసేవాడు. క్రమేపీ అది ఆ యింటి ఆచారం అయిపోయింది.
మన ఆచారాల్లో చాలా భాగం యిలాటివే. వధువు చిన్నపిల్లగా ఉండగా పెళ్లి చేసేరోజుల్లో తండ్రి ఒళ్లో కూర్చోబెట్టుకుని పెళ్లి చేసేవాడు, పెళ్లికూతుర్ని వివాహమండపానికి మేనమామ బుట్టలో తెచ్చేవాడు. పాతికేళ్లు దాటాక పెళ్లి చేసుకునే యీ రోజుల్లో యీ ఆచారాలకు అర్థం లేదు. పెళ్లి చూపులు అయ్యాకనే పెళ్లి చేసుకునే యీ రోజుల్లో మధ్యలో తెర పట్టడంలో అర్థం లేదు. మతసిద్ధాంతాలతో సంబంధం లేని యిలాటి ఆచారాలకు మతపరమైన అర్థాలు కల్పించడం, అంతరార్థాలు బనాయించడం యీ రోజుల్లో విపరీతమై పోయింది. మతం పేరుతో వీటిని చలామణీ చేస్తూండడంతో వీళ్లని విమర్శిస్తే సోకాల్డ్ ఆస్తికులకు కోపం వస్తోంది. ఈ వ్యాఖ్యాన ప్రకోపాల గురించి తదుపరి వ్యాసంలో మరింతగా చెప్తాను.
ఈ లోపుగా ఒక మనవి – యితర మతాల్లోని దురాచారాల గురించి రాయమని కొందరు అడుగుతున్నారు. హిందూమతంలోని ఆచారాల గురించే నాకు క్షుణ్ణంగా తెలియదు. అనేక కులాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్న ఆచారాలు, దురాచారాలు, మూఢవిశ్వాసాల గురించి పూర్తి అవగాహన లేదు. ఇక యితర మతస్తుల గురించి బొత్తిగా తెలియదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మతం వ్యవస్థీకృతం అయిన అన్ని సందర్భాల్లో దురాచారాలు ఉండి తీరతాయి. మతాధికారులు వాటిని భక్తులపై రుద్దుతూనే ఉంటారు. మతాల మౌలిక గ్రంథాలలో ఉండే సూత్రాలు అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటాయి. మోజెస్ తెచ్చిన టెన్ కమాండ్మెంట్స్ (దశాదేశాలు) చూస్తే అవి యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు మాత్రమే వర్తించవని అర్థమౌతుంది. కవట్ నాట్ దై నైబర్స్ వైఫ్ (పొరుగువాడి భార్యను ఆశించకు) అనేది రామాయణ గాథలో నీతి కాదా! అయితే ఆచరణకు వచ్చేసరికి ఆ సూత్రాలు గాలికి ఎగిరిపోతాయి. దేవుడి పేరు చెప్పి పాలకుడు, మతాధికారి సామాన్యులను పీడిస్తారు. ఇతర మతాల వాళ్లపై రెచ్చగొడతారు.
ఒకే కుదురు నుంచి వచ్చిన యూదులు, క్రైస్తవులు కొట్టుకు చచ్చారు. ఇంచుమించు అదే కుదురు నుంచి వచ్చిన క్రైస్తవులు, ముస్లిములు మతయుద్ధాల పేర దశాబ్దాల తరబడి యుద్ధాలు చేశారు. వివిధ దేశాలకు చెందిన, వివిధ ప్రాంతాలకు చెందిన ఒకే మతస్తులు కలహించుకున్నారు. మతమనేది మనుష్యులను కలపటం లేదు. ఇతరులపై కాలు దువ్వడానికి, శాఖల పేర తమలో తాము విడగొట్టుకుని కాట్లాడుకోవడానికి పనికి వస్తోంది. క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం – అన్ని మతాల్లో మతాచారాల కారణంగా బాధితులున్నారు. ఆ యా ప్రాంతాల్లో సాహిత్యాన్ని చదివితే మనకు వాటి గురించి వివరాలు తెలుస్తాయి. వాటిని ఎదిరించవలసినది ఆ మతస్తులే, ఆ కులస్తులే. ఆ తిరుగుబాటును అణచి వేయడానికి ఛాందసులు శతథా ప్రయత్నిస్తారు. మార్పు కారణంగా ప్రళయం వచ్చేస్తుందని భయపెడతారు. ఏమీ రాదని వాళ్లకూ తెలుసు. విద్యార్జన చేసినకొద్దీ అజ్ఞానం పటాపంచలవుతుంది. ముఖ్యంగా స్త్రీ విద్యావంతురాలైతే సమాజం త్వరగా సంస్కరించ బడుతుంది. అది జరగకుండా చూడడానికే స్త్రీలపై విపరీతమైన ఆంక్షలు పెడతారు.
ఇది అన్ని మతాల్లో కనబడినా, నేటి ఇస్లాంలో ఎక్కువగా కనబడుతోంది. నిజానికి మహమ్మదు ప్రవక్త కాలంలో మహిళల స్థితి యింకా అధ్వాన్నంగా ఉండేదిట. ఆయన రూపొందించిన సంస్కరణలు ఆనాటికి ఆధునికమైనవి. కానీ తర్వాతి కాలంలో కాలానుగుణమైన మార్పులు కొన్ని దేశాల్లో, కొన్ని సమయాల్లో చేశారు. కొన్నిటిలో చేయలేదు. చాలా దేశాల్లో ముందువెనుక ఊగిసలాట ఉంటోంది. ఇస్లాం అమలు ప్రపంచవ్యాప్తంగా ఒకలా లేదు. మార్పు అవసరమైన చోట అక్కడి సమాజం ఉద్యమించాలి. హైందవ సమాజం కూడా మారుతూ వస్తోంది కానీ మారవలసినంత మారటం లేదు. మధ్యమధ్యలో ఛాందసం వైపు దిగజారుతోంది. ఇటీవలి కాలంలో ఛాందసత్వానికి ఆధునికతను అలంకరించి కొత్త రూపంలో తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి గురించి హెచ్చరించడమే యీ వ్యాసావళి ఉద్దేశం. పునరుక్తి దోషం తగిలినా ఫర్వాలేదని చెపుతున్నా – ఇవన్నీ మతంలో భాగం కాదు, మతం యొక్క మౌలిక సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి. సంస్కరించవలసినది సమాజాన్ని, దాని ఆలోచనా ధోరణిని మాత్రమే.
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2018)
[email protected]