అరవిందకు నోటా హెచ్చరిక

అక్టోబర్ అంత స్మూత్ రన్నింగ్ లా కనిపించడం లేదు టాలీవుడ్ సినిమాలకు. అక్టోబర్ అంటే దసరా సీజన్. ఫుల్ జోష్ వుంటుంది జనాలకు. అందుకే ఆ నెల 11న విడుదల ప్లాన్ చేసారు ఎన్టీఆర్-తివిక్రమ్…

అక్టోబర్ అంత స్మూత్ రన్నింగ్ లా కనిపించడం లేదు టాలీవుడ్ సినిమాలకు. అక్టోబర్ అంటే దసరా సీజన్. ఫుల్ జోష్ వుంటుంది జనాలకు. అందుకే ఆ నెల 11న విడుదల ప్లాన్ చేసారు ఎన్టీఆర్-తివిక్రమ్ సినిమా అరవింద సమేత వీర రాఘవకు. భారీ సినిమా. వందకోట్ల సినిమా అందువల్ల సరైన స్లాట్ కావాలని ఏరికోరి ఎంచుకున్నారు.

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో మాగ్జిమమ్ సినిమాలు దులిపేసారు. అందువల్ల అరవిందకు పెద్దగా పోటీలేదు. సూపర్ డేట్ దొరికింది అనుకున్నారంతా. కానీ తీరాచూస్తే, అన్ని విధాలా అడకత్తెరలో ఇరుక్కునేటట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవకు వారం ముందుగా రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ లోని అమర్ అక్బర్ ఆంథోని షెడ్యూలు అయివుంది. రవితేజ సినిమా బాగుంటే మాస్ సెంటర్లలో పీక్స్ లో వుంటుంది. ఎటొచ్చీ బాగుండాలి. అలాగే అరవింద వచ్చిన వారానికి రామ్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లోని హలోగురూ ప్రేమకోసమే విడుదల డేట్ అనౌన్స్ చేసారు. దానికి ఒకటి రెండురోజలు అవతలగా విశాల్ – లింగుస్వామిల పందెంకోడి-2 సినిమా డేట్ ఇచ్చారు.

ఇదిలా వుంటే యంగ్ తరంగ్, యూత్ సెన్సెషన్ విజయ్ దేవరకొండ కూడా బరిలోకి దిగుతున్నాడు. అక్టోబర్ నాలుగున అతగాడి లేటెస్ట్ సినిమా 'నోటా' విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా వుంటుందీ అన్నది పక్కన పెడితే, ఓపెనింగ్స్ హడావుడి మాత్రం పక్కా. సినిమా బాగుంటే కచ్చితంగా రెండు, మూడు వారాలు దున్నేస్తుంది. అప్పుడు దానికి వారం వెనుకగా వచ్చే అరవిందకు కాస్త ఇబ్బందే.

ఇబ్బంది అంటే అసలు సమస్య, వందకోట్లకు పైగా టార్గెట్ రీచ్ కావడంలో. సోలో విడుదల అయితే దాని లెక్క వేరు. ఇటు రెండు సినిమాలు అటు రెండు సినిమాలు మధ్యలో ఇది అంటే కొంచెం చూడాల్సిందే. ఎన్ని సినిమాలు వున్నా, ఏ సినిమా అయినా ఇప్పుడు సక్సెస్ కొడితేనే జనం థియేటర్ కు వస్తున్నారు. లేదూ అంటే ఫస్ట్ వీకెండ్ తో సరి. అందువల్ల దసరా బరిలోకి దిగుతున్న అయిదు సినిమాల పరిస్థితి ఏమిటో విడుదలయ్యాకే తెలుస్తుంది.

ఈ సంగతి అలా వుంచితే ఇక థియేటర్ల సమస్య కూడా మామూలే. నోటా, అమర్ అక్బర్ ఆంథోనీ రెండువారాలు కనీసం థియేటర్లో వుంటాయి. ఫలితం ఎలావున్నా దసరా సీజన్ ను మిస్ చేసుకోరు. అంటే దసరా వీక్ కు మూడు సినిమాలు థియేటర్లలో వుంటాయి. అంటే ఆ మేరకు రెవెన్యూ షేర్ చేసుకోవడమే. అదే వందకోట్ల అరవిందకు అసలు సమస్య.