సినిమా హీరోలు సినిమాల్లోనే హీరోలు. బయటకు మాత్రం ఓ విధంగా జీరోలే. దేనికైనా సాయం చేయాలంటే, జనాల ముందుకు జోలె పట్టుకురెడీ అవుతారు. ఈ మధ్య కాస్త మారి, కొంచెం విరాళాలు ఇస్తున్నారు కానీ, గతంలో అయితే జనం దగ్గర వసూలు చేసి ఇవ్వడమే. కోటి రూపాయిల నుంచి పాతికకోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోలు మనకు వున్నారు. వీరందరూ సభ్యులుగా వున్న మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి మాత్రం జనాల దగ్గర చందాలెత్తుతున్నారు.
అమెరికా వెళ్లి కార్యక్రమాలు చేసి, జనాల దగ్గర డబ్బులు లాగడమే తప్ప, వీరు జేబుల్లోంచి తమ సంఘం కోసం, తమ సంఘ భవనం కోసం డబ్బులు తీసే ఆలోచన చేయడంలేదు. మా అధ్యక్షుడు శివాజీ రాజా చెప్పిన లెక్కల ప్రకారం, మా దగ్గర వున్న నిధులు అయిదు కోట్లు. గతంలో రెండుకోట్లు వుండేవి. చిరంజీవిని అమెరికా తీసుకెళ్లడం ద్వారా ఓ కోటి సంపాదించారు. మరో రెండు కోట్లు యాడ్ చేయగలిగారు. ఇంకో అయిదు కోట్లు జోడించాలని ప్రయత్నం. దానికోసం మహేష్ ను, ప్రభాస్ ను, నాగార్జునను తీసుకెళ్తారట.
ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ అయిదుగురు ఇరవై కోట్లకు పైగా తీసుకునే హీరోలు. మెగాస్టార్ చిరంజీవి వుండనే వున్నారు. వీళ్లు తమ సంఘానికి ఒక్కో కోటి విరాళం ఇచ్చినా చాలు. ఆరుకోట్లు వచ్చి పడతాయి. రవితేజ, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున, అయిదు నుంచి పదికోట్లు తీసుకునే హీరోలు. ఈ నలుగురు తలా యాభై లక్షలు ఇచ్చినా చాలు. మరో రెండు కోట్లు రాలతాయి.
ఇక నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాగచైతన్య, నిఖిల్, అఖిల్, వరుణ్ తేజ్, సాయిధరమ్, ఇలా యంగ్ హీరోలంతా రెండు కోట్ల నుంచి నాలుగైదు కోట్ల వరకు తీసుకుంటున్నారు. వీళ్లు తలా పాతికలక్షలు ఇచ్చినా చాలు. మరో రెండు మూడు కోట్లు వస్తాయి.
అంటే ఇప్పుడు గిరాకీలో వున్న హీరోలు ఈ విధంగా ఇస్తే సులువుగా పదికోట్లు వచ్చిపడతాయి. అలా చేయడం మానేసి, అమెరికా వెళ్తాం. జనాలకు పాస్ లు అమ్మి, డబ్బులు పోగెట్టి భవనం కడతాం అంటారేంటీ? వీళ్ల సంఘ భవనానికి జనం దగ్గర డబ్బులు దేవురించడం ఎందుకు? వీళ్ల సినిమాలు చూసి జనాలే డబ్బులు ఇవ్వాలి.
వీళ్ల అసోసియేషన్ కు జనాలే డబ్బులు ఇవ్వాలి. ఇది చాలదన్నట్లు సంఘంలో పోగెట్టిన డబ్బుల్లో మళ్లీ కుంభకోణాలు కూడానూ. జనాలకు సినిమా పిచ్చి పోయే వరకు వీళ్ల వ్యవహారం ఇలాగే వుంటుంది.