సాధారణంగా పెద్ద సినిమాలు అంటే పాటల చిత్రీకరణ మీద కూడా ఆసక్తి వుంటుంది. ఈ మధ్య పెద్ద హీరోల పాటలకు సెట్ లు వేయడం అన్నది కాస్త తగ్గింది. మహా అయితే ఓ పాటను సెట్లో కానీ, గ్రాఫిక్స్ వర్క్ తో కానీ చిత్రీకరిస్తున్నారు. మిగిలినవి అన్నీ కొత్త కొత్త విదేశీ లోకేషన్లలో తీస్తున్నారు.
లేటెస్ట్ విషయానికి వస్తే, టైమ్ తో పాటు పరుగులు పెడుతోంది ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సినిమా అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమా విడుదలకు ఇంక మరో 35 రోజుల సమయం మాత్రమే వుంది. టాకీ కొంత బకాయి వుంది. అలాగే మూడు పాటలు తీయాల్సి వుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ మామూలే.
ఇప్పటికిప్పుడు మూడు పాటలు విదేశాల్లో తీయాలంటే కనీసం పదిరోజుల టైమ్ కావాలి. అందుకే రెండు పాటలను హైదరాబాద్ లోనే సెట్ లు వేసి తీసే విధంగా ప్లానింగ్ మార్చారు. మిగిలిన ఒక పాటను మాత్రం యూరప్ లో తీయబోతున్నారు. ఒకటైనా విదేశీ లోకేషన్ లో తీయకపోతే సినిమాకు లుక్ తేడా వస్తుంది. అందుకే ఓ పాటను యూరప్ లో రెండు పాటలను ఇక్కడా తీస్తారు.
టాకీ ఈనెల 20 నాటికి పూర్తయిపోతుందని అంచనా. ఈ లోగానే ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నెలాఖరులోగా రెండు పాటలు ఫినిష్ చేసి, బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ కు సినిమాను అప్పగిస్తారు. విదేశాల్లో తీయాల్సిన ఒక్క పాటను తీసి, లాస్ట్ మినిట్ లో జోడించుకున్నా సమస్య వుండదు అన్నది ప్లానింగ్ గా తెలుస్తోంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హారిక హాసిని సంస్థ నిర్మాత.