సుమారు ఏడాది కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని మొత్తం ఏడు ఎంపీ నియోజకవర్గాల్లోనూ తిరుగులేని విజయంతో ఢంకా బజాయించి గెలిచిన భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా చతికిలపడింది. అధికారంలోకి వచ్చి తీరుతాం అనే నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్న మోడీ దళం.. కనీసం మొత్తం స్థానాల్లో ఎనిమిదవ వంతు సీట్లకు పరిమితమైంది. ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ పార్టీని విజయపథంలో నడిపిస్తున్న ముద్ర కలిగి ఉన్న అమిత్ షా నిర్వహించిన ప్రచారం గాని వారికి ఏ మాత్రం లాభించలేక పోయాయి. ప్రజల తీర్పు లో ఉన్న మర్మం ఏమిటో మోడీ సర్కారు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే వారికి భవిష్యత్తు ఉంటుంది.
ఢిల్లీ రాష్ట్ర ప్రజలు రాజధాని కి తగిన వివేచన వివేకం ఉన్న ప్రజలు గా గుర్తింపు తెచ్చుకున్నారు. పది నెలల కిందట జరిగిన ఎన్నికలలో నూరు శాతం విజయాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టిన వాళ్లే… ఇప్పుడు వారిని దారుణంగా తిప్పికొట్టారు. ఈ ఒక్క సంవత్సరంలో మోడీ ఎంతగా అపకీర్తిని ప్రజల్లో అపనమ్మకాన్ని తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం.
సీఏఏ బిల్లు, ఎన్నార్సీ లాంటి మోడీ ప్రభుత్వ నిర్ణయాలు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి. దేశమంతా నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇవి రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు కాదు. కానీ ఆ విషయాన్ని గుర్తించనట్లుగా నటిస్తూ.. తమ నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆత్మవంచన చేసుకుంటూ మోడీ సర్కార్ గుడ్డిగా ముందుకు పోతోంది. అలాంటి వారికి ఒక పెద్ద ఝలక్ లాగా ఢిల్లీ ఎన్నికలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి .
మోడీ సర్కార్ కు అత్యంత హేయమైన రీతిలో ఎప్పటిలాగే హిందుత్వ కార్డును వాడుకుని ఢిల్లీ ఎన్నికల్లో కూడా గెలవాలని ఆశించింది. అయితే వివాదాస్పదం అయ్యాయో, వాటిని ట్రంప్ కార్డు లాగా ఎన్నికల్లో వాడింది. వాటివలన ముస్లిం సమాజం దూరం కావచ్చు కానీ, హిందువులందరూ తమ నెత్తిన పెట్టుకుంటారు అని ఆశించింది. కానీ అలా జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి… నిజాయితీ పాలనాదక్షత అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ కేజ్రీవాల్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారు.
ఏదైనా కొన్ని రాష్ట్రాలలో విజయాలు సాధిస్తూ ఉంటే గనుక, అది స్థానికంగా ఇతర పార్టీల చేతగానితనం వల్ల మాత్రమే అని మోడీ దళం తెలుసుకోవాల్సిన రోజు వచ్చింది.