దేశాన్ని పాలించిన పార్టీనా ఇది?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు.  బోణీ కొట్టలేకపోయారు. అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్…

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు.  బోణీ కొట్టలేకపోయారు. అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ ను చూస్తే ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు   తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.

 కాంగ్రెస్ పార్టీ దాదాపుగా యావత్తు దేశం లోను శవాసనం వేసినట్టే.  ఏదో ఒకటీ అరా రాష్ట్రాల్లో స్థానిక కారణాల నేపథ్యంలో వారి చేతికి అధికారం దక్కింది తప్ప.. ఆ పార్టీకి పూర్తిస్థాయిలో జవసత్వాలు ఉడిగిపోయాయి. ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని  దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న రాహుల్ నేతృత్వంలో,  ఆ పార్టీ మరింత అచేతనత్వాన్ని సమకూర్చుకుంది.  దాని ఫలితమే ఇప్పుడు ఇలా వరుస పరాజయాలు వారిని పలకరిస్తున్నాయి.

 గెలవడం ఓడిపోవడం అనేది ప్రధానమైన విషయం ఎప్పటికి కానేకాదు. ఎన్నికలన్నాక ఎవరో ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం అనివార్యంగా జరుగుతుంది.  కానీ ఆ ఎన్నికలను కనీసంగా ఎంత పట్టించుకున్నారు,  అక్కడి ప్రజల కోసం తమ ఏమాత్రం చూపించారు అనే విషయాలు మాత్రం పరిగణించాల్సినవే.  ఆ విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది.

 ఎన్నికల్లో కనీసం శ్రద్ధగా ప్రచారం కూడా నిర్వహించకుండా ఉదాసీనంగా ఉండిపోయింది.  చేతగానితనం కంటే అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఉదాసీనత.  ఎన్నికల్లో అభ్యర్థులను మోహరించడం గాని ప్రచారం చేయడంలో గాని కాంగ్రెస్ పార్టీకి ఏ దశలోనూ సీరియస్ నెస్ కనిపించలేదు. మోడీ ప్రభుత్వ ఇటీవలి నిర్ణయాల పట్ల దేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం అని ప్రకటిస్తున్న పార్టీ,  దేశమంతా మోడీ నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపు ఇస్తున్నపార్టీ…  ఇలాంటి సందర్భంలో  ఎన్నికల రూపేణా వచ్చిన  మంచి అవకాశాన్ని వినియోగించకోలేక పోయింది అంటే ఎవరిని తప్పు పట్టాలి? నిజానికి మోడీ తీసుకునే నిర్ణయాలు కంటే కాంగ్రెస్ పార్టీ అచేతనత్వమే దేశానికి ఎక్కువ ప్రమాదకరం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రతి ఒక్కరిలోనూ బ్రేకప్ ఉంటుంది