దిల్లీ ఎన్నిక ఫలితాలు వచ్చాయి. ఆప్‌కు 62 సీట్లు, 54% ఓట్లు, బిజెపికి 38% ఓట్లు 8 సీట్లు రాగా కాంగ్రెసుకు 0 సీట్లు, 4% ఓట్లు వచ్చాయి. బిజెపి అధికార ప్రతినిథులు 2015తో పోలిస్తే మాకు 5 సీట్లు 6% ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్పుకుంటున్నారు.
ఎప్పుడో ఐదేళ్ల క్రితం అంకెలెందుకు, ఇన్నాళ్లలో మోదీ అమోఘంగా పాలించేశాడని చెప్పుకుంటున్నారు కదా, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సంపాదించిన 57% ఓట్లు 65 సీట్లు (అసెంబ్లీ సిగ్మెంట్లు) తో పోల్చి చూస్తే 19% ఓట్లు, 57 సీట్లు తగ్గాయి కదా అంటున్నారు వారి ప్రత్యర్థులు.
అనేకమంది ఆప్‌కు 50కి అటూయిటూ వస్తాయన్నారు కానీ ఎబిపి-సి ఓటరు వాళ్లు 51-65 అంటూ వైడ్ మార్జిన్ యిచ్చారు. ఇండియా టుడే-ఏక్సిస్ వాళ్లు మాత్రం 59-68 మధ్య వస్తాయని చెప్పారు. చివరకు అదే నిజమైంది. పోలరైజేషన్ పాలిటిక్స్ ఫెయిలయ్యాయి. అభివృద్ధి గురించి ఫోకస్ చేసినవారికే విజయం దక్కింది. చాణక్యనీతి పేర జరిగే ఫిరాయింపు చర్యలకు అవకాశం లేకుండా దిల్లీ ఓటరు ఢంకా బజాయించి తీర్పు యిచ్చాడు.
8న ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాగానే బిజెపి వాళ్లు వాటిని కొట్టిపడేశారు. ఈ పోల్స్ అన్నీ సాయంత్రం 4 గంటలకే ముగించేస్తారు, 5 గంటలకల్లా టీవీ స్టూడియోల్లో కూర్చోవాలని. కానీ మా ఓటింగంతా తర్వాతే అయింది అన్నారు. దిల్లీలో మధ్యాహ్నం 3 గంటల దాకా 30% ఓటింగే జరిగింది. అది చూసి బిజెపి నాయకత్వం కంగారు పడింది. ఎందుకంటే బీదాబిక్కీ ఆప్‌కు వేస్తున్నారు కానీ, బిజెపికి ఓట్లేసే ఎగువ మధ్యతరగతి ప్రజలు, ధనిక ప్రజలు యిల్లు కదలలేదని తేలింది. వాళ్లకు బిజెపి అంటే అభిమానం ఉంది కానీ తమ చేతులతో అరవింద్‌ను ఓడించడానికి సిద్ధంగా లేరు. అందువన ఓటింగుకి మొహం చాటేశారు.
ఇలా అయితే కొంప మునుగుతుందని గ్రహించి బిజెపి క్యాడర్ రంగంలోకి దిగి, పోలింగు బూత్‌కు జనాల్ని లాక్కుని వచ్చారు. మొత్తం మీద 55% ఓటింగు జరిగింది. అందువలన మధ్యాహ్నం పడిన ఓట్లన్నీ మావే. అది లెక్కలోకి తీసుకోకుండా గణిస్తే సర్వే తప్పినట్లే అన్నారు. ఆప్ ఓట్లు 2015లో 54%, 2017 మునిసిపల్ ఎన్నికలో 28%, 2019 పార్లమెంటు ఎన్నికలో 22%.. యిలా తగ్గుతూ వస్తున్నాయని గుర్తు చేశారు.
ఏది ఏమైనా బిజెపి మరోసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది. కారణాలేమిటంటే పాతవే చెప్తున్నారు – స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా జాతీయ సమస్యలతో అసెంబ్లీ ఎన్నికలు గెలవాలని చూడడం, సమాజాన్ని వర్గీకరించాలని చూడడం, గల్లీ నుంచి దిల్లీ దాకా మోదీనే అభ్యర్థిగా చూపడం తప్ప స్థానిక నాయకత్వాన్ని తయారు చేయకపోవడం, ప్రాంతీయ పార్టీ నాయకుకులకు ప్రత్యామ్నాయంగా బలమైన అభ్యర్థిని చూపలేకపోవడం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అభ్యర్థిని చూపారు కానీ ఓటర్లకు వాళ్ల మొహం నచ్చలేదు. అటు ఆప్ చూస్తే సంక్షేమ పథకాలను పకడ్బందీగా, అవినీతి ఆరోపణలు లేకుండా అమలు చేసింది. కేవలం సంక్షేమం వలననే నెగ్గాడని తేల్చేయడం ప్రమాదం. అంతకంటె తాయిలాలు యిచ్చినవారు కూడా ఓడిపోయారు.
ఇలాటి యిబ్బందులు ఉన్నాయని తెలిసినపుడు బిజెపి యుద్ధాన్ని మరీ హైపిచ్లోకి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. కానీ 200 పైచిలుకు ఎంపీలు, 11 మంది ముఖ్యమంత్రులు, సాక్షాత్తు ప్రధాని, హోం మినిస్టర్, యితర మంత్రులు అందరూ కలిసి 70 ఎమ్మేల్యేలున్న అర్ధరాష్ట్రమైన దిల్లీ కోసం పోరాడడం పిచిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లయింది. పోనీ ఆ అస్త్రం పనిచేసిందా అదీ లేదు, తుస్సుమంది. ఇప్పుడేమో గత 21 ఏళ్లగా దిల్లీలో బిజెపి ప్రతిపక్షంలో వుండడం చేత క్యాడర్లో నైతిక స్థయిర్యం లోపించింది. అలసత్వం చోటు చేసుకుంది అని సాకులు చెప్తున్నారు.
దిల్లీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకమైనదని, అరవింద్‌ను నమిలి ఉమ్మేద్దామని బిజెపి అధినాయకత్వం చూస్తోందని, పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాటప్పుడు బద్ధకంగా ఎలా వుంటారు? పైగా కొత్తగా అధ్యక్షుడైన నడ్డా ప్రథమ కబళే మక్షికాపాతః (మొదటి ముద్దలో యీగ పడింది) అన్నట్లు కాకూడదని క్యాడర్‌ను శతవిధాల ఉత్సాహపరిచి వుంటాడు కదా.
2017లో మునిసిపల్ ఎన్నికలలో బిజెపి చేతిలో ఓడిపోయిన దగ్గర్నుంచి అరవింద్ నోరు సంబాళించుకుని, తన పని తాను చేసుకుంటున్నాడు. వివాదాల్లోకి లాగబోయినా దిగలేదు. అతను వాగ్దానాలు చేసిన మేరకు చేయలేకపోయాడు కానీ ఎంతోకొంత గట్టిగానే చేశాడని ఓటర్లు తృప్తి పడ్డారు. కానీ బిజెపి మాత్రం అతన్ని నానా తిట్లూ తిట్టింది. టెర్రరిస్టంది, మరోటంది. ఏం లాభం? ప్రజలు నమ్మలేదు.
తమ భావాలతో ఏకీభవించని ప్రతివారిని దేశద్రోహులనడం బిజెపికి అలవాటై పోయింది. కానీ ప్రజలు అలా అనుకోవటం లేదని స్పష్టమైంది. అరవింద్ చెప్పినదేదీ చేయలేదు, అతన్ని వదిలేయండి, మా దగ్గర అతని కంటె పాలనాసామర్థ్యం ఉన్న ఫలానావాడున్నాడు అని బిజెపి ఎవర్నీ చూపించలేదు. అరవింద్ వెర్సస్ మోదీ అంటూ ప్రచారం సాగించారు. కానీ ఓటర్లకు తెలుసు మోదీ ప్రధాని పదవి వదిలివచ్చి దిల్లీ పాలించడని! మీరుండే చోట మీరుండండి, మాక్కావలసిన వాణ్ని మేం ఎంచుకుంటాం అని చెప్పారు వాళ్లు.
అయినా ఎప్పుడు చూసినా ‘మోదీయే దేశభక్తుడు, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పగల సమర్థుడు. పాకిస్తాన్ మనని నాశనం చేద్దామని చూస్తోంది. దాని ఏజంట్లు మీ యింట్లోనే ఉన్నారు. మీ పక్కనే మసలుతున్నారు. వాళ్లని గుర్తుపట్టండి, ఏరివేయండి, అణగదొక్కండి, తరిమివేయండి.’ అనే నినాదమే. పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు పంచాయితీ ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా అదే పాట పాడితే విసుగెత్తదా?
‘మీ జనాభాలో దాదాపు ఆరోవంతు వున్న మైనారిటీల వలన మీకు ముప్పుంది అని హిందువుల్లో అభద్రతాభావం రేకెత్తించి లాభపడదామని మీరు చూసినా ప్రజలు మీకు ఓట్లు రాల్చలేదెందుకు?’ అని అడిగితే చర్చలో పాల్గొన్న ఒక బిజెపి ప్రతినిథి సమాధానమిచ్చాడు. ‘నేను ఓటర్లను అడిగాను – సిఏఏ అమలు కాకపోతే ఎలా అనే భయం మీకు లేదా? అని. మోదీజీ వుండగా మాకేం భయం?’ అన్నారు వాళ్లు.’ అని. ఇదేదో కాచ్-22 సిచ్యువేషన్లా వుంది. బిజెపి కొత్త స్ట్రాటజీ వర్కవుట్ చేసుకోవాలి.
జెఎన్‌యు, జామియా, షహీన్‌బాగ్.. యిలా ఎన్ని బూచులను చూపించినా పని కాలేదు, తన నాయకుల చేత ఎంతటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయించినా ఫలితం లేకపోయింది. ముస్లిములు తమనేదో చేసేస్తారనే భయం మెజారిటీ హిందువుల్లో లేదు. సిఏఏ, ఎన్నార్సీ, ఎన్పిఆర్- ఏవీ ఓట్లు రాల్చటం లేదు. వచ్చిన ఓట్లు ఉజ్జ్వల, టాయిలెట్స్ వంటి ఉపయోగపడే పథకాల వలననే అంటున్నారు. దిల్లీ మొత్తంలో యుపి, బిహార్ ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లున్న తూర్పుదిల్లీలో, ఈశాన్య దిల్లీలో కాసిన్ని సీట్లు వచ్చాయి. తక్కిన అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో బిజెపి ఓడిపోయింది. ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలున్న ప్రాంతాలలో కూడా బిజెపి నెగ్గలేక పోయింది. అయితే 2015తో పోలిస్తే ఓట్లు పెరిగాయి. కారణం ఏమిటంటే కాంగ్రెసు ఓట్లలో సగం, ఇతరుల ఓట్లు, స్వతంత్రుల ఓట్లు బిజెపికి మళ్లాయంటున్నారు. వయసు మళ్లినవారు సాధారణంగా కాంగ్రెసుకు ఓటేస్తూ ఉంటారు. ఈసారి వాళ్లు బిజెపికి వేశారట.
బిజెపికి పెద్ద దెబ్బ తగిలింది యువత ఓట్లలోట. గతంతో పోలిస్తే ఆ వర్గం వాళ్లకు మోదీపై మోజు తగ్గిందని సర్వేలు చెపుతున్నాయి. దానికి కారణం విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా వున్నపుడు వాళ్లు మోదీ పఠించిన అవినీతిరహిత అభివృద్ధి మంత్రానికి ముగ్ధులయ్యారు. 6 ఏళ్ల తర్వాత చూస్తే మోదీ వాటి మాట మాట్లాడటం లేదు. ఎంతసేపూ పాకిస్తాన్, ఉగ్రవాదం, దేశభక్తి గురించే మాట్లాడుతున్నారు. ఇటు చూస్తే తమకు ఉద్యోగాలు రావటం లేదు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా లేదు.
దిల్లీ ఎన్నిక ఫలితాల గురించి గణాంకాలు వచ్చాక మరింత స్పష్టమైన రూపం వస్తుంది. అప్పుడు బిజెపి రాజకీయాల స్థితిగతుల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ లోపున మనం జనరల్‌గా మాట్లాడుకోవచ్చు. మోదీ దాదాపు ఆరేళ్ల పాలన తర్వాత ఆయన ముక్కు కిందే ఉండే దిల్లీలో ఆ పార్టీకి 11% సీట్లు మాత్రమే రావడం, అర్భకుడైన ప్రత్యర్థికి 89% సీట్లు రావడం బిజెపికి ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినట్లే.
‘మేలుకో మోదీ మేలుకో, గాంధీల చేతిలో ఉన్నంతకాలం కాంగ్రెసు నీ దరి చేరలేదు. నిన్ను ఢీకొనగలిగే ప్రతిపక్ష నాయకుడు లేడు కానీ నీకు నువ్వే శత్రువుగా మారుతున్నావు. నీ ప్రాధాన్యతా క్రమం మార్చుకో. ప్రజలు యిచ్చిన భారీ జనాదేశంతో ఏదైనా మంచి చెయ్యి. ఆర్థిక పరిస్థితి బాగుపరచడానికి గట్టి ప్రయత్నం చేయి. విదేశాల్లో ఎంత పేరు తెచ్చుకుంటే ఏం లాభం? దేశంలో ప్రజాస్వామ్యం హరించడమే కాక, పార్టీలో ప్రజాస్వామ్యం కూడా హరిస్తున్నావు. అధికారాలన్నీ గుప్పిట్లో పెట్టుకుని, చుట్టూ జీహుజూరుగాళ్లని పెట్టుకుని, విపరీత ప్రయోగాలు చేస్తున్నావు. విధానాలు మార్చుకో, ఎజెండా మార్చు. విభజన రాజకీయాలు పనికి రావిక్కడ. ఇంటి పొరుగున ఉన్న ముస్లిములతో ప్రజలకు భయం లేదు, భయపెట్టాలని చూడకు, చూస్తే నిన్నే భయపెడతారు వాళ్లు. టెర్రరిస్టు అని మీరు అన్నవాడే యివాళ మిమ్మల్ని టెర్రరైజ్ చేశాడు గుర్తించు.’ అని దిల్లీ ఓటరు చెప్పాడు. వినేవాళ్లున్నారా?
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)