ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్: రాజమౌళిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్

రాజమౌళి ఇప్పుడేమైనా మాట్లాడాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఏదైనా ట్వీట్ చేయాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే ట్వీట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా ఇద్దరు పెద్ద హీరోలకు సంబంధించిన ప్రాజెక్టు. చరణ్, తారక్…

రాజమౌళి ఇప్పుడేమైనా మాట్లాడాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఏదైనా ట్వీట్ చేయాలనుకుంటే ఆర్ఆర్ఆర్ గురించి మాత్రమే ట్వీట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా ఇద్దరు పెద్ద హీరోలకు సంబంధించిన ప్రాజెక్టు. చరణ్, తారక్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా. ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తూ ఇతర విషయాలు మాట్లాడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అలాంటి చేదు అనుభవమే ఎదురైంది జక్కన్నకి.

రామ్ గోపాల్ వర్మ తాత అయ్యాడంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. నిజానికి ఇలాంటి సరదా ట్వీట్లు జక్కన్న ఎప్పుడూ చేయడు. కానీ ఎందుకో ఈసారి కాస్త మూడొచ్చినట్టుంది. అందుకే ట్వీటాడు. కానీ చరణ్-తారక్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని సరదాగా తీసుకోలేదు. ముందు సినిమా పని కానివ్వు, ఆ తర్వాతే ట్వీట్ అనే అర్థం వచ్చేలా కామెంట్లతో హోరెత్తించారు. సినిమాపై అప్ డేట్స్ ఇవ్వకుండా ఇలాంటి ట్వీట్లు ఎందుకంటూ చురకలంటించారు.

వర్మపై రాజమౌళి సరదాగా ట్వీట్ పెడితే.. ఆ మేటర్ వదిలేసి రాజమౌళిని టార్గెట్ చేశారు ఫ్యాన్స్. ఆల్రెడీ సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే కాకుండా.. ఇలాంటి ట్వీట్లు కూడా పెట్టి మా సహనాన్ని పరీక్షించొద్దంటూ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే తగులుకున్నారు. రాజమౌళి నుంచి ట్వీట్ వస్తే అది ఆర్ఆర్ఆర్ అప్ డేట్ మాత్రమే అవ్వాలంటూ అల్టిమేటం జారీచేశారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.

రాజమౌళిపై ట్రోలింగ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. తన వర్గానికి, తన స్నేహితులకు సంబంధించిన సినిమాలపై రెగ్యులర్ గా ట్విట్టర్ లో స్పందించే రాజమౌళి, గతంలో కొన్ని “ముఖ్యమైన” సినిమాలపై రియాక్ట్ అవ్వడం మరిచిపోయాడు. ఆ టైమ్ లో రాజమౌళిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు నెటిజన్లు. ఇప్పుడు వర్మపై ట్వీట్ పెడుతూ మరోసారి దొరికిపోయాడు జక్కన్న.