రంగస్థలం వన్-గీత గోవిందం 2

ఈ ఏడాది టాప్ వన్ మూవీ ఏది? రంగస్థలం నా? గీత గోవిందం నా? రెవెన్యూ పరంగా రంగస్థలం సినిమానే. అందులో నో డౌట్. ఎందుకంటే 70 కోట్లకు పైగా పెట్టుబడి మీద 123…

ఈ ఏడాది టాప్ వన్ మూవీ ఏది? రంగస్థలం నా? గీత గోవిందం నా? రెవెన్యూ పరంగా రంగస్థలం సినిమానే. అందులో నో డౌట్. ఎందుకంటే 70 కోట్లకు పైగా పెట్టుబడి మీద 123 కోట్ల షేర్, రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది రంగస్థలం సినిమాకు. అంటే ఎవరికి అయితేనేం లాభాలు దాదాపు 50 కోట్లకు పైగా వచ్చాయి. అంటే రూపాయికి దగ్గర దగ్గర రూపాయి లాభం అన్నమాట. అయితే రంగస్థలం సినిమాకు ఓ అడ్వాంటేజ్ వుంది. దానికి శాటిలైట్, డిజిటల్ డబ్బులు భయంకరంగా వచ్చాయి. అవి ఓ ముఫై కోట్లకు పైగా వుంటాయి. అవి కలుపుకుంటే రూపాయికి రెండు రూపాయలు లాభం అవుతుంది. 

గీత గోవిందం సినిమాకు 14 కోట్ల పెట్టుబడికి దాదాపు వందకోట్లకు పైగా గ్రాస్, 50 కోట్లకు పైగా షేర్. వచ్చింది. అంటే రూపాయికి నాలుగు రూపాయలు లాభం అన్నమాట. కానీ గీత గోవిందం సినిమాకు శాటిలైట్ డిజిటల్ డబ్బులు పెద్దగా రాలేదు. అందవల్ల ఆ విషయంలో రంగస్థలం కన్నా వెనుకబడింది.

రంగస్థలం లాభం యాభై కోట్లకు పైగా, గీత గోవిందం లాభం నలభై కోట్ల వరకు. కానీ మరి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ లెక్కలు చూసుకుంటే.. అప్పుడు గీతగోవిందం సినిమానే ఎక్కువ లాభాలు తెచ్చుకున్నట్లు. ఎందుకంటే రూపాయికి రూపాయి కాదు, రూపాయికి నాలుగు రూపాయలు లాభం అన్నమాట.

ఈ విధంగా ఈ ఏడాది లాభాలు ఇచ్చిన సినిమాల్లో మరి కొన్ని సినిమాలు కూడా వున్నాయి. ఆర్ ఎక్స్ 100 కూడా ఈ బాపతు సినిమానే. రెండున్నర నుంచి మూడు కోట్ల పెట్టుబడి బడితో దాదాపు 15కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఛలో సినిమా కూడా తక్కువ పెట్టుబడితో ఒకటిన్నర రెట్లు లాభం సంపాదించింది.

మహానటి సినిమా కూడా దగ్గర దగ్గర రూపాయికి అర్థరూపాయి లాభం తెచ్చుకుంది. 45 కోట్లకు పైగా షేర్ సాధించింది. భాగమతి సినిమా కూడా మంచి వసూళ్లు తెచ్చుకుంది కానీ, పెట్టుబడి ఎక్కువ కావడం మైనస్ అయింది. గూఢచారి ఈ వరుసలో కాస్త ఆఖరున వున్నా, అది కూడా రూపాయికి అర్థరూపాయి నుంచి రూపాయి వరకు లాభం సంపాదించింది.

ఇక బ్లాక్ బస్టర్ గా చెప్పుకునే భరత్ అనే నేను సినిమా మాత్రం ఈ జాబితాలోకి రాదు. దానికి కారణం కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చినా, కొన్ని ఏరియాల బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కాకపోవడమే.