cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగు సినీ కళామతల్లిని 'అమ్ముకున్నది' ఎవరు.?

తెలుగు సినీ కళామతల్లిని 'అమ్ముకున్నది' ఎవరు.?

సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తాము తెలుగు సినీ కళామతల్లి బిడ్డలమని చెప్పుకునేవారే. 'మేమంతా అన్నదమ్ములమే.. మా మధ్య విభేదాల్లేవు..' అని చెప్పని తెలుగు సినీ ప్రముఖుడుండరు. కానీ, సినీ పరిశ్రమలో రాజకీయాలు.. సాధారణ రాజకీయాల్ని మించి వుంటాయి. ఒకరంటే ఒకరికి 'అక్కసు'. అందరూ అని కాదుగానీ, మెజార్టీ సినీ ప్రముఖుల్లో ఈ పరిస్థితి సుస్పష్టంగా కన్పిస్తుంటుంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు కావొచ్చు, మరో వ్యవహారం కావొచ్చు.. ఇలాంటి రాజకీయాలు తెలుగు సినీ పరిశ్రమ పరువుని బజార్న పడేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. 

తాజాగా, తెలుగు సినీ పరిశ్రమను మరో వివాదం కుదిపేస్తోంది. 'మా' అధ్యక్షుడు శివాజీరాజాపై, 'మా' సభ్యుడు, 'మా' జనరల్‌ సెక్రెటరీ, సీనియర్‌ నటుడు నరేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవితో విదేశాల్లో 'మా' కోసం చేపట్టిన ఓ కార్యక్రమం కోసం సేకరించిన నిధుల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగిందన్నది నరేష్‌ ఆరోపణ. అయితే, నరేష్‌ ఆరోపణల్ని శివాజీరాజాతోపాటు, హీరో శ్రీకాంత్‌, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కొట్టి పారేశారు.

'రూపాయి అక్రమ మార్గంలో వెళ్ళినా, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తా..' అని శివాజీరాజా సవాల్‌ విసిరితే, తనపై చేస్తున్న ఆరోపణల్ని నిరూపిస్తే మొత్తంగా 'మా' నుంచి బయటకు వెళ్ళిపోతానని నరేష్‌పై శ్రీకాంత్‌ కూడా మండిపడిపోయాడు. అంతలోనే, మీడియా ముందుకొచ్చాడు నరేష్‌. తన వాదనని ఆయనా సమర్థవంతంగా చెప్పుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి. 

రెండు కోట్ల రూపాయల నిధుల సమీకరణ జరుగుతుందని తొలుత భావిస్తే, కోటి రూపాయలే రావడమేంటన్నది నరేష్‌ ప్రశ్న. 'అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు, ఒప్పందం ప్రకారమే అన్నీ జరిగాయ్‌' అన్నది శివాజీరాజా వాదన. నిజ నిర్ధారణ కమిటీ వేయాలనీ, ప్రభుత్వ జోక్యం కూడా ఈ విషయంలో అవసరమని నరేష్‌ తెగేసి చెబుతున్నారు. 

ఈ మొత్తం వ్యవహారంపై మరోమారు తెలుగు సినీ పరిశ్రమ 'పెద్దలు' తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అందుబాటులో వున్న ప్రముఖులంతా ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారట. చిరంజీవి స్వయంగా కల్పించుకుని, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడమెలాగన్నదానిపై ఆయా ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి తెలుగు సినీ పరిశ్రమకి వివాదాలు కొత్తేమీ కాదు. డ్రగ్స్‌, వ్యభిచార వ్యవహారాలు.. లైంగిక వేధింపులు - కాస్టింగ్‌ కౌచ్‌ వివాదాలు.. ఇలా ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమను భ్రష్టుపట్టించేసిన అనేక ఘటనల్ని చూశాం. ఇప్పుడు తాజాగా, సిని'మా' పేరు చెప్పి, సినీ కళామతల్లిని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారన్న ఆరోపణలే నిజమైతే, అంతకన్నా దారుణం ఇంకొకటి వుండదు.