ఇప్పుడు వెన్నెల కిషోర్ టాలీవుడ్ టాప్ కమెడియన్. అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ చాలు జనం ఫకాల్న నవ్వేయడానికి. అలాంటిది కంటిన్యూగా ఏడెనిమిది నిమషాల పాటు ఓ సీన్ చేస్తే ఎలా వుంటుంది? చిలసౌ సినిమాలో మెట్లు ఎక్కే సీన్, పక్కింటి మహిళను అర్థరాత్రి లేపి జ్యూస్ అడిగే సీన్, గీత గోవిందంలో క్లయిమాక్స్ ముందు సీన్లు గుర్తుకు వస్తాయిగా.
ఇప్పుడు వీటికి మించి ఓ మాంచి ఎపిసోడ్ చేసాడట వెన్నెల కిషోర్. శైలాజరెడ్డి అల్లుడు సినిమా కోసం వెన్నెల కిషోర్ మీద దర్శకుడు మారుతి చిత్రీకరించారట. ఈ సీన్ అంతా దాదాపు చీకట్లో సాగుతుందని తెలుస్తోంది. సుమారు ఏడెనిమిది నిమషాల వరకు వుండే ఈ సీన్ చాలా హిలేరయస్ గా వుంటుందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ సీన్ ముందుగా స్క్రిప్ట్ లో లేదు. సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తయిన తరువాత, డెవలప్ మెంట్ ప్లానింగ్ లో వచ్చిన ఐడియాతో దీన్ని తయారుచేసారు. దీనికోసం వెన్నెల కిషోర్ మూడురోజులు ప్రత్యేకంగా డేట్ లు కేటాయించాడట.
ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాకు కొద్దిగా రీరికార్డింగ్ బకాయి వుంది. అది ఫినిష్ చేసుకుని, ఈనెల 13న విడుదలవుతుంది.