విజయ్ దేవరకొండకు, కేటీఆర్-కవితతో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా తెలంగాణలో ముందస్తుగానే ఎన్నికలొస్తున్నాయి. కాబట్టి ఇదేదో వాళ్ల కోసం దేవరకొండ చేస్తున్న ప్రచారం అనుకోవద్దు. ఇది స్వయంగా తనకోసం తాను చేసుకుంటున్న ప్రచారం. అవును.. ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతున్నానని ప్రకటించాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ఈ హీరో నోటా అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రచారాన్ని ఇవాళ్టి నుంచి షురూ చేయబోతున్నారు. ఇదొక పొలిటికల్ డ్రామా. అందుకే సినిమా ప్రమోషన్ ను ఎన్నికల ప్రచారంతో పోలుస్తూ ట్వీట్ చేశాడు దేవరకొండ.
నోటా సినిమాను అక్టోబర్ మొదటివారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే సరిగ్గా నెలరోజులు టైం ఉందన్నమాట. ఈ నెల రోజులు నోటా సినిమాకు ప్రచారం కల్పించాలని డిసైడ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. సో.. ఈ హీరో ఇక గీతగోవిందం మేనియా నుంచి బయటకొచ్చేసినట్టే.
విజయ్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న మొట్టమొదటి ద్విభాషా చిత్రమిది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తమిళ్ లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాడు విజయ్. అంతేకాదు, ఎక్స్ క్లూజివ్ గా చెన్నైలో ప్రచారం కూడా చేయబోతున్నాడు.
మరోవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. గ్రాఫిక్స్ పూర్తికాలేదని కొందరు, రీషూట్స్ జరుగుతున్నాయని మరికొందరు చెప్పుకొస్తున్నారు. నోటా విడుదల తర్వాత టాక్సీవాలా విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.