ప్రభాస్ కొత్త సినిమా వ్యవహారం మరీ కామెడీ మేటర్ లా తయారైంది. ఈ సినిమా చర్చించుకోవడానికే తప్ప సెట్స్ పైకి రాదంటూ ఇండస్ట్రీలో జోకులు కూడా పేలుతున్నాయి. అయినా కూడా మేకర్స్ ఫీలర్లు ఆపడం లేదు. సీజన్ కో తేదీ ప్రకటిస్తూ జోకులకు మరింత ఆస్కారం కల్పిస్తూనే ఉన్నారు.
ప్రభాస్-రాధాకృష్ణ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఇది ఇప్పటిది కాదు. బాహుబలి-2 రిలీజైన తర్వాత నుంచి చెబుతున్నారు. అలా సాగదీసుకుంటూ వచ్చి జులైలో ఓపెనింగ్ అన్నారు. ఆ తర్వాత ఆగస్ట్ అన్నారు. అది కూడా గడిచిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ లోకి వచ్చేశాం. కాబట్టి మళ్లీ కొత్తగా తేదీలు పుట్టుకొచ్చాయి.
లేటెస్ట్ ఫీలర్ ఏంటంటే.. ప్రభాస్ కొత్త సినిమా ఈ గురువారమే (6వ తేది) లాంఛ్ అవుతుందట. ఈసారి మాత్రం జనాలు ఈ తేదీని సీరియస్ గా తీసుకోలేదు. పులి-తోక కథలా ఇప్పటికే చాలా తేదీలు చెప్పి తుస్సుమనించారు కాబట్టి ఇది కూడా అలాంటిదే అనే ఫీలింగ్ లో పడిపోయారు.
ఈ సినిమాతో వచ్చిన చిక్కంతా ఏంటంటే.. మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చే జనాలే కరువయ్యారు. ప్రభాస్ ఏమో సాహో షూటింగ్ తో బిజీగా ఉంటాడు. ఒకవేళ షూటింగ్ లేకపోయినా బయటకు రాడు. దర్శకుడేమో కథ రెడీగా ఉంది కానీ తేదీల సంగతి తనకు తెలియదంటాడు. డేట్ ఫిక్స్ చేయాల్సిన నిర్మాతలు మాత్రం ముసిముసిగా నవ్వుతూ తప్పించుకుంటున్నారు. ఇదీ ఈ సినిమా వ్యవహారం.