పక్కా ఫిక్షన్ సినిమాగా సైరా?

ఫిక్షన్ వేరు, ఒరిజినాలిటీకి దగ్గరగా వుండడం వేరు. అప్పట్లో అల్లూరి సీతారామ రాజు సినిమాను హీరో కృష్ణ తీసినపుడు, ఆ సినిమాలో గెటప్ లు అన్నీ సహజత్వానికి కాస్త దగ్గగా వుండేలా చూసుకున్నారు. అంతే…

ఫిక్షన్ వేరు, ఒరిజినాలిటీకి దగ్గరగా వుండడం వేరు. అప్పట్లో అల్లూరి సీతారామ రాజు సినిమాను హీరో కృష్ణ తీసినపుడు, ఆ సినిమాలో గెటప్ లు అన్నీ సహజత్వానికి కాస్త దగ్గగా వుండేలా చూసుకున్నారు. అంతే కానీ అల్లూరి సీతారామ రాజుకు ఒక అధ్భుతమైన కాల్పనిక గెటప్ తయారుచేయలేదు. 

బాహుబలి సినిమా అన్నది ఫిక్షన్ కాబట్టి ఎలాంటి గెటప్ లు ప్లాన్ చేసినా నడచిపోతుంది. అది ఇండియన్ ఆర్కిటెక్చరా? మరోటా, ఇవన్నీ అక్కడ డిస్కషన్ కు రావు. అదే ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులతో వాస్కోడీగామా కథ నేపథ్యంలో ఉరిమి సినిమా మళయాళంలో తీస్తే, ఆ గెటప్ లు అన్నీ అప్పటివే పక్కాగా వుండేలా చూసుకున్నారు.

ఇప్పుడు సైరా సినిమా మాత్రం గెటప్ ల విషయంలో కాస్త ఎక్కువ లిబర్టీనే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమలో కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన కథ ఆధారంగా సైరా సినిమా తీస్తున్నారు. కానీ చిరంజీవి, అమితాబ్, లేటెస్ట్ గా బయటకు వచ్చిన సుదీప గెటప్ లు చూస్తుంటే ఓ ఫిక్షన్ సినిమా గెటప్ లు మాదిరిగా వున్నాయి తప్ప, నాచురల్ గా అయితే కాదు.

భారీ సినిమా, చిరంజీవి అభిమానులను కూడా దృష్టిలో వుంచుకుని తీస్తున్న సినిమా, బాహుబలి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమా కనుక ఈ గెటప్ లు ప్లాన్ చేసారు అని చెబితే ఓకె అని అనుకోవాల్సిందే. సుదీప గెటప్ చూస్తుంటే, రాయలసీమ, వందల ఏళ్ల క్రితం, అవుకు రాజు పాత్ర, పైగా తెలుగుతనం మచ్చుకైనా లేని ఆ గెటప్ ఏమిటా? అనిపిస్తుంది.

అలా కాకుండా ఓ తొలితరం వీరుడి కథ, అది కూడా రాయలసీమ నేఫథ్యంలో చెబుతున్న కథ అనుకుంటే, గెటప్ లు మరీ ఎక్కువ కాకపోయినా, సహజత్వానికి దగ్గరగా వుండేలా చూస్తే మరింత కథకు న్యాయం చేసినట్లు అవుతుందేమో?

అయినా అసలు కథకు ఫిక్షన్ హంగులు జోడించడం మన సినిమా మేకర్లకు అలవాటే. అన్నమయ్య చేతనే డ్యూయట్లు పాడించేసాం. రామదాసులో రసికత చూపించాం. ఇది అనగా ఎంత?