ఢిల్లీ జీరో: కాంగ్రెస్ వృద్ధుల తీరు మార‌లేదు!

వ‌ర‌స‌గా రెండో సారి ఢిల్లీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెర‌వ‌లేక‌పోయిన‌ట్టుగా ఉంది. ఐదేళ్ల కింద‌ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జోరోకు ప‌రిమితం అయ్యింది. ఒక ద‌శ‌లో వ‌ర‌స‌గా మూడు…

వ‌ర‌స‌గా రెండో సారి ఢిల్లీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెర‌వ‌లేక‌పోయిన‌ట్టుగా ఉంది. ఐదేళ్ల కింద‌ట అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జోరోకు ప‌రిమితం అయ్యింది. ఒక ద‌శ‌లో వ‌ర‌స‌గా మూడు ప‌ర్యాయాలు ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా ఢిల్లీ కాంగ్రెస్ కు కంచుకోట‌గా నిలిచింది. ఢిల్లీ నుంచి కొంద‌రు కాంగ్రెస్ ప్ర‌ముఖ నేత‌లు ఎంపీలుగా కూడా నెగ్గుతూ వ‌చ్చారు. వారిలో క‌పిల్ సిబాల్ ఒక‌రు. 

అయితే 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అలాంటి వారంతా ఓడిపోయారు. త‌ర్వాత వ‌చ్చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడింది. సున్నాకు ప‌రిమితం అయ్యింది. బీజేపీ మూడు ఎమ్మెల్యే సీట్ల‌లో నెగ్గి ఒక ర‌కంగా అవ‌మానాల పాలైతే, కాంగ్రెస్ సున్నా కు ప‌రిమిత‌మై మ‌రో ర‌కంగా అవ‌మానానికి గురి అయ్యింది. ఇక ఈ సారి కూడా కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగు కాలేదు. కౌటింగ్ లో ఒక ద‌శ‌లో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ సీట్లో కాస్త లీడ్ లో నిలిచింది. ఆ త‌ర్వాత అది కూడా లేదు. కాంగ్రెస్ స్థూలంగా సున్నాకు ప‌రిమితం అయిన దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి.

కాంగ్రెస్ సంప్ర‌దాయ ఓటు బ్యాంకునంతా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. బీజేపీ వ్య‌తిరేక ఓటు, కాంగ్రెస్ సంప్ర‌దాయ ఓటు.. ఇలా అంతా ఆప్ ద‌రికి చేరింది. త్రిముఖ పోరులో త‌మ ఓట్లు చీలి బీజేపీని గెలిపించ‌డం క‌న్నా.. కాంగ్రెస్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి, గెలుపు గుర్రం లాంటి ఆప్ కే జై కొట్టాల‌ని ఢిల్లీ ఓట‌ర్లు బ‌లంగా ఫిక్స‌యిన‌ట్టుగా ఉన్నారు!

ఇక ఇలాంటి ఫ‌లితాల‌ను ఎదుర్కొన్నా కాంగ్రెస్ వృద్ధ నేత‌ల తీరు మాత్రం మారిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ఢిల్లీ ఫ‌లితాల‌పై స్పందిస్తూ.. వారు మ‌ళ్లీ ఈవీఎంల హ్యాకింగ్ గురించినే మాట్లాడారు! కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ ఈ మేర‌కు మ‌ళ్లీ పాత పాటే పాడారు. చిప్ ఉన్న ఏ మిష‌న్ ను అయినా హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని ఈ మేధావి చెప్పుకొచ్చారు. చాలా డెవ‌ల‌ప్డ్ దేశాల్లో కూడా ఈవీఎంలు వాడ‌టం లేద‌ని మ‌రో లాజిక్ తీశారు. ఒక‌వేళ బీజేపీ గ‌నుక ఢిల్లీలో స్వీప్ చేసి ఉంటే.. కాంగ్రెస్ వాళ్ల ఈ డొల్ల వాద‌న‌కు ఏదో ఒక ఊతం ల‌భించేది. అయితే అక్క‌డ గెలిచింది, స్వీప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ విష‌యాన్ని కూడా గ్ర‌హించ‌కుండా మాట్లాడే నేత‌లున్న కాంగ్రెస్ పార్టీకి సున్నా కు మించి ఎక్కువ సీట్లు రాక‌పోవ‌డంతో పెద్ద విడ్డూరం లేదేమో!

ప్రతి ఒక్కరిలోనూ బ్రేకప్ ఉంటుంది