తను ఢిల్లీకి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్టుగా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ! ఇక అమిత్ షా అయితే ఎన్ఆర్సీ, సీఏఏలకు ఢిల్లీ ఎన్నికలు రెఫరండం అన్నట్టుగా ప్రచారం చేశారు! అంతేనా.. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అయితే నోరుకు హద్దే లేకుండా మాట్లాడారు! పాకిస్తాన్ పేరును పదే పదే ప్రస్తావించారు. ఈ విషయంలో శ్రీమాన్ మోడీ మహాశయుడు ఏం తగ్గలేదు. *పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తోంది.. వారం రోజుల సమయం చాలు పాక్ ను ఓడించడానికి..* అంటూ మాట్లాడారు!
ఉన్నట్టుండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పాక్ ఎందుకు గుర్తుకు వచ్చిందని చాలా మంది సందేహించారు. ఏదో రకంగా పాకిస్తాన్ ప్రస్తావన తెచ్చి, పాక్ ను అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటే ఓట్లు పడతాయనే లెక్కలతోనే ప్రధాని అలా మాట్లాడారని విశ్లేషకులు తేల్చారు! మరీ ప్రధాని అలా మాట్లాడారు. ఆ మాటలు భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని అర్థమయ్యేలా చేశాయి. ఇది అర్థం కాని వారు ఎవరూ లేకపోవచ్చు. ఎన్నికలెప్పుడు వచ్చినా.. పాకిస్తాన్ ప్రస్తావనే రక్షిస్తుందని బీజేపీ భావిస్తోంది కాబోలు!
అయితే వరసగా వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలతో అయినా బీజేపీ మేల్కొనాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు బీజేపీ చేజారాయి. ఢిల్లీలో మోడీ, షాలు తామే పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసినా.. 15 సీట్లు గగనం అయిపోతున్నాయి. ఇలా కమలం పార్టీకి మరో రాష్ట్రంలో భంగపాటు తప్పలేదు. ఇకనైనా పాకిస్తాన్ ప్రస్తావన ఆపి, దేశంలోని సమస్యలను ప్రస్తావిస్తే బీజేపీ వాళ్లకే మేలేమో!