ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ స్కోరు క్రమక్రమంగా పడిపోతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ వాళ్లు బీజేపీకి బాగానే సీట్లు ఇచ్చారు. బీజేపీ అక్కడ అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎవరూ చెప్పలేదు కానీ, బీజేపీకి 20కి పైగా సీట్లు దక్కుతాయని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. కమలం పార్టీ అలా పరువు నిలుపుకుంటుందని అవి అభిప్రాయపడ్డాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గట్టిగానే కసరత్తు చేసింది. తనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా మోడీ మాట్లాడారు. అమిత్ షా కూడా అక్కడే పాగా వేసి చాలా ప్రచారమే చేశారు. ఇక కొందరు కేంద్రమంత్రులు అయితే ఇష్టానికి మాట్లాడారు. ఢిల్లీలో తాము కాకుండా ఎవరు గెలిచినా పాకిస్తాన్ గెలిచినట్టే అనేంత స్థాయిలో వారి ప్రచార పర్వం సాగింది. అలా తెగేవరకూ లాగేట్టుగా, తీవ్ర అసహనంతో మాట్లాడారు బీజేపీ నేతలు. అయితే వారి అతిని, అసహనాన్ని పిచ్చలైట్ తీసుకున్నారు ఢిల్లీ జనాలు.
ఇక కౌంటింగ్ లో ఒక దశలో భారతీయ జనతా పార్టీ 20 సీట్ల వరకూ లీడ్ లో కనిపించింది. ఆ తర్వాత ఆ నంబర్ 15కు జారింది. చివరి వరకూ ఆ మాత్రం లీడ్ ను బీజేపీ కనబరుస్తుందనే అభిప్రాయాలు కలిగాయి. అయితే రౌండ్ రౌండ్ కూ బీజేపీ సీట్లు తగ్గిపోతూ రావడం గమనార్హం. ఒక దశలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న సీట్ల సంఖ్య 8కి చేరింది. మళ్లీ ఆరుకు పడిపోయింది. మరి చివరి వరకూ అయినా బీజేపీ ఆ ఆరు సీట్లనైనా నిలబెట్టుకుంటుందా? లేక ఐదేళ్ల కిందట గెలిచినట్టుగా మూడుకు పరిమితమవుతుందా.. అనేది కౌంటింగ్ పూర్తి అయితే కానీ స్పష్టత రాని అంశంలా కనిపిస్తోంది!