‘అల…వైకుంఠపురము’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమా కథా నాయకుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆ సినిమాలోని పాటలే వినిపిస్తాయి. బన్నీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటూ తన భావాలను అభిమానులతో పంచుకోవడం తరచూ చూస్తున్నాం.
తాజాగా ఓ పాట, ఆ పాటకు అంగవైకల్యంతో బాధపడుతున్న యువతీ యువకుడు స్టెప్పులేయడం ఆయన్ను ముగ్ధున్ని చేసింది. మనసులో చెలరేగిన భావాలను వెంటనే ఆయన ట్విటర్ ద్వారా బాహ్య ప్రపంచంతో పంచుకున్నాడు.
‘బుట్టబొమ్మా…బుట్టబొమ్మా’ …ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటను పాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట భాషతో సంబంధం లేకుండా సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. అందువల్లే తెలుగు పాట అయినప్పటికీ టాలీవుడ్ నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఇది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం.
టిక్‌టాక్ తెరవగానే ఈ పాట మన కళ్లెదుట ప్రత్యక్షమై వీనుల విందుగొలిపే సంగీతం, సాహిత్యం చెవుల్లోకి దూరి, మనసుకు హాయి కలిగిస్తోంది. అందువల్లే దక్షిణ, ఉత్తర దిక్కులనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లు ఈ పాటకు డ్యాన్స్‌లు చేస్తూ తమను తాము మైమరుస్తున్నారు. సంగీతానికి ఉన్న గొప్పదనాన్ని ఈ పాట చాటి చెబుతోంది.
మాజీ ప్రపంచ సుందరి శిల్పాశెట్టి సైతం ఈ పాటకు మంత్రముగ్ధురాలై బుట్టబొమ్మలా మారి డ్యాన్స్ వేసి కెవ్వు కేక అనిపించారు. ఈ పాట గొప్పదనానికి తగ్గట్టుగా తాజాగా కాళ్లు లేని యువకుడు, చేతుల్లేని యువతి లయబద్ధంగా డ్యాన్స్ ఇరగదీశారు. వీరి డ్యాన్స్ స్టైలిష్ స్టార్ బన్నీ హృదయాన్ని గెలుచుకొంది.
‘బుట్టబొమ్మా వీడియోల్లో నా గుండెను తాకింది ఇదే. సంగీతం మనో వైకల్యాన్ని కూడా మరిపిస్తుంది. ఈ వీడియోనూ చూసి ఎంతో సంతోషించాను’ అని బన్నీ వైకల్యంతో బాధపడుతూ డ్యాన్స్ చేసిన ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. బన్నీ తన హృదయ స్పందన ఏంటో సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాగా ఈ వీడియోను సంగీత దర్శకుడు తమన్ కూడా షేర్ చేశాడు.