తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తిని రేపుతున్న అభ్యర్థుల్లో ఒకరు కమల్ హాసన్. సొంతంగా పార్టీ పెట్టి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేయించారు కమల్. అయితే అప్పట్లో కమల్ తను ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాత్రం కమల్ నిలిచారు.
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్ పోటీలో నిలిచారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం తన చిన్నకూతురుతో కలిసి తను పోటీలో ఉన్న నియోజకవర్గానికి వెళ్లారు కమల్. అక్కడ పోలింగ్ సరళిని ఆయన గమనించారు. అయితే తన ప్రత్యర్థులు ఓట్లు భారీగా పంచారు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు.. అనేది కమల్ ఆరోపణ.
పోలింగ్ స్లిప్ లను పంచే నెపంతో తన ప్రత్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ కమల్ ఆరోపిస్తున్నారు. రీ పోలింగ్ కు కోరతామని అంటున్నారు. మరి ఓటుకు నోట్లను పంచడంపై నిరసనతో కమల్ ఈ ఆరోపణ చేశారా, లేక ఓటమి భయమా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.
నిస్సందేహంగా కమల్ కు తమిళనాట ఎంతో కొంత రాజకీయ ఫాలోయింగ్ ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు అది మూడు నాలుగు శాతం ఓటుగా మారింది. ఏపీలో పవన్ కల్యాణ్ తెగ రాజకీయం చేస్తే ఇతడికి ఐదారు శాతం ఓటింగ్ లభించలేదు. పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయం కూడా చేయడం లేదు కమల్. అది కూడా ఎంతో కొంత సొంతంగా నిలబడ్డాడు.
ప్రధాన కూటముల్లో ఏదో ఒకవైపు ఉండటానికి కమల్ తపించడం లేదు. అయినా ఎంతో కొంత ఓట్ల శాతాన్ని అయితే సంపాదించుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. కమల్ ఎమ్మెల్యేగా నెగ్గగలరా? అనేది అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. తెలుగునాట స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలుకాగా, ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి ఏమిటనేది కూడా చర్చనీయాంశంగా నిలుస్తోంది. మరి కమల్ తమిళనాడు అసెంబ్లీలోకి ప్రవేశిస్తారా!