టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ ప్రచారానికి ప్రధాన ప్రత్యర్థి, అధికార పార్టీ వైసీపీ నుంచి డిమాండ్ పెరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ ముఖ్యమైన నాయకులు ప్రచారానికి రాకపోతే మంచిదని ప్రత్యర్థులు కోరుకుంటుంటారు. కానీ తిరుపతి ఉప బరిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానం లోకేశ్‌దే. అలాంటిది లోకేశ్ ప్రచారానికి వస్తే తమకు పది ఓట్లు పెరుగుతాయని వైసీపీ భావిస్తున్నదంటే … ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఒక్కసారి ఊహించుకోండి.
రాజకీయాల్లో నారా లోకేశ్, సినిమాల్లో బ్రహ్మానందం, సునీల్ సేమ్ టు సేమ్ అనే చర్చ జరుగుతోంది. కేవలం కామెడీ యాక్టర్స్ కోసమే చాలా వరకు సినిమాలు చూస్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో లోకేశ్ విషయానికి వస్తే ….ఆ ఘనత దక్కింది.
లోకేశ్ భాషా ప్రతిభా పాఠవాలు జనానికి లాఫింగ్ థెరపీలా ఉపయోగపడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు రోడ్‌షోలో లోకేశ్ తన మార్క్ కామెడీని ప్రదర్శించి నవ్వులు పండించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే క్రమంలో లోకేశ్ నవ్వులు కురిపిస్తూ, నవ్వుల పాలయ్యారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే… తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోతే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ‘పరామర్శించారా’ అనడానికి బదులు … ‘పరవశించారా’ అనడంతో జనం నుంచి నవ్వులే నవ్వులు, చప్పట్లు. ఇలా ఆయన తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా, అక్కడ లోకేశ్ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.
రామాయపట్నంతోపాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదంటూ లోకేశ్ అనడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ తమ ప్రాంతానికి ప్రచారానికి రావాలని వైసీపీ శ్రేణులు, నాయకుల నుంచి డిమాండ్ పెరగడంలో ఆశ్చర్యం ఏముంది?