తెలుగువారి కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన జస్టిస్ ఎన్వీ రమణతో తెలుగు సమాజ ప్రముఖులు దాగుడు మూతలు ఆడుతున్నారు. 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఉత్తర్వులు ఇవ్వడంతో తెలుగు సమాజం గర్వంతో పులకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. కానీ వారిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులెవరూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం విజయవంతం, ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు.
అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా అభినందనలు చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ చేపట్టబోయే నూతన బాధ్యతలు పూర్తి విజయవంతం కావాలని నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. రమణకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతి రావు, సరోజినిదేవీ దంపతులకు జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత న్యాయస్థాన పదవిని అలంకరించే స్థాయికి జస్టిస్ ఎన్వీ రమణ చేరుకోవడం తెలుగు వారిగా ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన సమయం ఇది.
1966లో తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా.. ఆ తరువాత 55 ఏళ్లకు జస్టిస్ రమణ మళ్లీ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపడుతున్న తెలుగు వ్యక్తిగా దేశం దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు, ప్రధాన న్యాయమూర్తిగా 2022 ఆగస్టు 26 వరకు అత్యధిక కాలం పదవిలో కొనసాగనున్నారు.
మన తెలుగు వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పదవికి ఎంపికైన సమయంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఇలా ఎవరూ కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడంలోని మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీ యాంశమైంది.
జస్టిస్ ఎన్వీ రమణకు విషెస్ చెప్పడంలో తెలుగు సమాజ రాజకీయ ప్రముఖులు ఊగిసలాటలో ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదు. చెబితే ఎలా అర్థం చేసుకుంటారోననే అనుమానాలే వారిని శుభాకాంక్షలు చెప్పకుండా అడ్డుకట్ట వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి సందర్భాల్లో కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తుండడం అవాంఛనీయం అని చెప్పక తప్పదు.