ఏపీలో ఐటీ దాడులు ఇపుడు హాట్ టాపిక్. దాన్ని టీడీపీ అసలు పట్టించుకోవడం లేదు. ఇక టీడీపీ అనుకూల మీడియా సైతం చాలా కన్వీనియెంట్ గా దాన్ని పక్కన పెట్టేసింది. మరో వైపు శాఖాపరంగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీద వైసీపీ సర్కార్ చర్యలు తీసుకుంటే మాత్రం చంద్రబాబు సహా తమ్ముళ్ళు పెద్ద నోరు చేస్తున్నారు.
దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ బాబుని గట్టిగానే నిలదీస్తున్నారు. ముందు ఐటీ దాడుల గురించి మాట్లాడు బాబూ అంటూ బొత్స ఎద్దేవా చేస్తున్నారు. మీతో పాటు అయిదేళ్ళు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ ఆస్తులపై ఐటీ సోదాలు గత కొన్ని రోజులుగా జరుగుతూంటే ఎందుకు బాబు నోరుమెదపడంలేదని బొత్స ప్రశ్నిస్తున్నారు.
ఐటీ దాడులలో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయని కూడా బొత్స అంటున్నారు. అటువంటి కీలకమైన పరిణామం విషయంలో బాబు కనీసం మాట్లాడకుండా ఏబీ మీద చర్యలు తీసుకుంటే మాత్రం తప్పుపడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది బాబు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖ రాజధానిని ఎవరూ కోరలేదని బాబుతో పాటు విశాఖ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడాన్ని బొత్స తప్పు పట్టారు.
తాము స్వయంగా ముఖ్యమంత్రి జగన్ని కలసి విశాఖలో రాజధాధని పెట్టాలని కోరామని చెప్పారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తాము రాజధాని కోరి మరీ తెస్తున్నామని ఆయన చెప్పుకున్నారు.
మరి అయిదేళ్ళ పాటు బాబు మంత్రివర్గంలో పనిచేసిన నాడు విశాఖ రాజధానిని కోరలేదని, ఇపుడు మాత్రం విశాఖ రాజధాని వద్దు అంటున్నారని బొత్స మండిపడ్డారు. ఇది దారుణమని, అయ్యన్న ఉత్తరాంధ్ర ద్రహిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.
ఇక దారిన పోయే దానయ్యలకు నల్లకోటు కప్పి పారిశ్రామికవేత్తలుగా జనాలకు చూపించి వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబులా తాము మోసం చేయమని బొత్స దెప్పిపొడిచారు. తాము వాస్తవంగా ఆలోచన చేస్తామని, విశాఖలో సచివాలయం పెడితే ఉద్యోగాలు వస్తాయని తాము ఎపుడూ చెప్పలేదని, ఇక్కడ అయిదారువేల కోట్లతో అభివ్రుధ్ధి చేస్తే భవిష్యత్తులో విశాఖ లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మాత్రమే తాము చెబుతున్నామని బొత్స అంటున్నారు. మొత్తానికి, బాబుకు, తమ్ముళ్ళకు బొత్స పక్కా క్లారిటీగా జవాబు చెప్పినట్లేనా.