ఒకరా ఇద్దరా.? ఇంకా లిస్ట్‌లో చాలామందే వున్నారు.! ప్రస్తుతానికి బయటపడ్డవారి లిస్ట్ చాలా చాలా చిన్నది.! అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, చంద్రబాబు హయాంలో అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా.. కాదు కాదు, టీడీపీ కార్యకర్తల్లా పనిచేసిన కొందరు ఉన్నతాధికారుల గురించి పంపుతున్న సంకేతాల సారాంశమిది. మొన్నామధ్య ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి.. తాజాగా ఓ ఐపీఎస్ అధికారి.. మధ్యలో మరికొందరు ఉన్నతాధికారులు.. వైఎస్ జగన్ హయాంలో తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ, తమ విధులకు దూరమవ్వాల్సి వచ్చింది.
అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో.? ఈ ప్రశ్న చాలామందికి రావడం సహజమే. కానీ, గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనని పరిగణనలోకి తీసుకుంటే, అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటే.. ‘తప్పదు, చాలామంది ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిందే..’ అనే అభిప్రాయం కలగకమానదు. తహసీల్దారుగా పనిచేసిన వనజాక్షిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే, ఆ ఘటనలో బాధితురాలైన వనజాక్షినే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హెచ్చరించిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.? జరిగిన చాలా చాలా పెద్ద వ్యవహారాల్లో, ఇది ఓ చిన్న ఘటన మాత్రమే.
‘అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడతారా.? మీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు అక్రమాలకు పాల్పడి.. చాలామంది అధికారుల్ని అప్పట్లో మీరు బలి చేశారు.. ఆ మకిలి వదిలించుకోవడానికి, మా హయాంలో పనిచేసిన అధికారులపై మీరు పగపట్టారా.?’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చాలా అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చంద్రబాబు హయాంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్నే తీసుకుంటే, ‘ఆయనే మా పార్టీలో ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తే మంచిదన్న విషయాన్ని డిసైడ్ చేస్తారు..’ అంటూ సాక్షాత్తూ టీడీపీ నేతలే వెంకటేశ్వరరావు గురించి పార్టీ మీటింగుల్లో చెప్పుకున్నారు. అదీ, చంద్రబాబు హయాంలో టీడీపీకి వెంకటేశ్వరరావు చేసిన ‘సేవ’ తాలూకు గొప్పతనం.
ఇక, అప్పట్లో జరిగిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కూడా ఏబీ వెంకటేశ్వరరావు కీలక భూమిక పోషించారన్న విమర్శలున్నాయి. ప్రతిపక్ష నేతపై విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే, ‘కోడి కత్తి ఘటన – పబ్లిసిటీ స్టంట్’ అనే స్థాయిలో అప్పటి డీజీపీ వ్యాఖ్యానించారంటే, చంద్రబాబు హయాంలో వ్యవస్థలు ఎలా నడిచాయో అర్థం చేసుకోవచ్చు. ఆ పైత్యానికి ‘విరుగుడు’ మందు వేస్తోంది వైఎస్ జగన్ సర్కార్.
అక్రమాల లెక్కలు తేలుతున్నాయ్.. వేల కోట్ల రూపాయల అక్రమాలంటూ తాము చేస్తున్నవి ఉత్త ఆరోపణలు కావనీ, వాటన్నిటినీ నిరూపిస్తామని.. ఏకంగా అధికారుల విషయంలోనే వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.