సాధారణంగా పెద్ద హీరో సెట్ లో వున్నారు అంటే, నిర్మాత కూడా కచ్చితంగా సెట్ లో వుంటారు. ఒకవేళ వుండలేని పరిస్థితి వస్తే, ఆయన తరపున కీలమైన బాధ్యులు వుంటారు. ఇది ఇండస్ట్రీలో కామన్. కానీ హీరో వున్న ప్రతి రోజూ నిర్మాత కూడా వుండాలి అంటే కష్టమే. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా, వంద కోట్ల వ్యవహారం అన్నపుడు నిర్మాతకు అనేక టెన్షన్లు వుంటాయి.పనులు వుంటాయి. హీరోలు అవి అర్థం చేసుకోవాలి. సర్దుకు పోవాలి.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నిర్మాత ఎఎమ్ రత్నంకు ముందే హుకుం జారీ చేసేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను సెట్ లో వుంటే నిర్మాత కూడా వుండాల్సిందే అని ఆదేశాలు జారీ చేసినట్లు బోగట్టా. గత వారం పది రోజుల్లో క్రిష్ డైరక్షన్ లో సినిమా షూట్ జరిగింది. ఒక షెడ్యూలు క్లోజ్ అయింది. ఈ షెడ్యూలు ఫ్రారంభంలో ఓ రోజు నిర్మాత రాకపోయేసరికి పవన్ ఈ మేరకు క్లియర్ గా చెప్పేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ప్రస్తుతానికి పవన్ చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్ ల్లో ఆయన పాత్ర మేరకు చెరో షెడ్యూలు పూర్తయ్యాయి. పింక్ రీమేక్ మాత్రం పవన్ లేని సీన్లు షూట్ జరుపుకుంటోంది. క్రిష్ సినిమా తరువాత షెడ్యూలు మాత్రం ఇప్పట్లో లేదు.