టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల ధిక్కరణ షాక్ నుంచి తేరుకున్నట్టేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం చంద్రబాబు ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకూ విస్తృతంగా పర్యటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆయనకు తీవ్ర షాక్ ఇచ్చాయి. దీంతో ఆవేశంలో ఆయన పార్టీకి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారనే వ్యతిరేక అభిప్రాయాలు సొంత పార్టీ నుంచే రావడం గమనార్హం.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే ఆయన పిలుపునే పార్టీ నేతలు, కార్యకర్తలు బహిష్కరించడం చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చినట్టైంది. తన పిలుపును బహిష్కరించడంతో పార్టీలో తన పట్టు సడలుతుందనే చేదు వాస్తవాన్ని ఆయన జీర్ణించు కోలేకున్నారు.
మరో వైపు వారసుడిగా తన కుమారుడు లోకేశ్‌ను ముందుకు తేవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, స్వీకరించేందుకు మరీ ముఖ్యంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా లేకపోవడం ఆయనలో దిగులు రగుల్చుతోంది. టీడీపీ శ్రేణులే లోకేశ్‌ను నాయకుడిగా గుర్తించలేని పరిస్థితుల్లో ఇక ప్రజలెలా పరిగణలోకి తీసుకుంటారనే ఆవేదన ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణకు బాబు చెప్పిన కారణాలు సొంత పార్టీ శ్రేణుల్నే కన్విన్స్ చేయలేక పోయాయి. మరోవైపు బాబు నిర్ణయాన్ని తప్పు పట్టడానికి ప్రతిపక్షాలకు పని లేకుండా, సొంత పార్టీ ముఖ్య నేతలైన అశోక్‌గజ పతిరాజు, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు తప్పు పట్టడం గమనార్హం. దీంతో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న బాబు పిలుపునకు విలువ లేకుండా పోయింది.
గెలుపోటములతో సంబంధం లేకుండా గ్రామస్థాయిలో టీడీపీ శ్రేణులు పోటీలో నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకోవడం గమనార్హం. దీంతో తాను చారిత్రక తప్పిదానికి పాల్పడ్డానన్న ఆలోచన బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాని నుంచి కోలుకోవడానికి బాబు నానా యాతన పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం బాబు వెళ్తుండడం, వారం పాటు రోజుకొక్క నియోజకవర్గంలో పర్యటిస్తారని నేతలు చెబుతున్నారు. దీంతో ఆయన షాక్ నుంచి తేరుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ బాబులో ఇలాంటి ధోరణి చూడలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.