ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు తన మార్క్ జిమ్మిక్కులు చేస్తున్నారా? అంటే… వైసీపీ వర్గాలు ఔనని అంటున్నాయి. ఎన్నికలంటే వ్యూహ, ప్రతివ్యూహాలుంటాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలకు పైఎత్తులేస్తూ, చివరికి ప్రజాదరణ పొందిన వారే విజేతలుగా నిలుస్తారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నెన్నో ఆలోచిస్తూ వాటిని అమలు చేస్తుంటాయి. చంద్రబాబునాయుడు కూడా అలాంటి వ్యూహాలే రచిస్తున్నారని వైసీపీ అంటోంది.
పులివెందుల పర్యటనను ఉదాహరణగా వైసీపీ తీసుకుని, దాని వెనుక చంద్రబాబు ఉద్దేశాన్ని విశ్లేషిస్తోంది. వైసీపీకి అత్యంత బలమైన నియోజకవర్గం పులివెందుల. అక్కడ చంద్రబాబు మీటింగ్ పెట్టడం వ్యూహంలో భాగమే. పులివెందులలో తనకు ఘన స్వాగతం పలికారని, గతంలో ఎన్నడూ లేని విధంగా జనం వెల్లువెత్తారని, మార్పు సీఎం నియోజకవర్గం నుంచే మొదలైందని చంద్రబాబు తనదైన నటనతో చెప్పారు.
అయితే పులివెందులలో బాబు సభకు వచ్చిన వారిలో సగానికి పైగా ఇతర నియోజకవర్గాల నుంచి తరలించిన జనమే అని వైసీపీ చెబుతోంది. పులివెందులకు సమీప నియోజకవర్గాలపైన జమ్మలమడుగు, కమలాపురం, తాడిపత్రి, కడప , ప్రొద్దుటూరు నుంచి టీడీపీ కార్యకర్తలను తరలించినట్టు వైసీపీ చెబుతోంది. ఇది నిజం కూడా.
పులివెందులకు హాజరైన జనాన్ని అడ్డు పెట్టుకుని, వాపును చూసి బలమని భ్రమిస్తూ, తన వాళ్లను భ్రమలో ముంచుతూ వైసీపీ పని అయిపోయిందనే మైండ్‌గేమ్‌కు చంద్రబాబు తెరలేపారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. పులివెందులలో టీడీపీకి అంత సీన్ లేదని, రానున్న రోజుల్లో కనీసం ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేరని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇటు పులివెందుల, అటు కుప్పం కేంద్రాలుగా టీడీపీ, వైసీపీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి.