కరోనా ప్రభావం.. మూతపడిన ప్రముఖ ఆలయం

కరోనా ప్రభావం ప్రసిద్ధ ఆలయంలో పడింది. మహారాష్ట్రలో విసృంఖలంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిరిడీలోని ప్రముఖ సాయిబాబా ఆలయాన్ని మూసేశారు. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఆలయాన్ని పూర్తిగా మూసేసినట్టు సాయిబాబా…

కరోనా ప్రభావం ప్రసిద్ధ ఆలయంలో పడింది. మహారాష్ట్రలో విసృంఖలంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిరిడీలోని ప్రముఖ సాయిబాబా ఆలయాన్ని మూసేశారు. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఆలయాన్ని పూర్తిగా మూసేసినట్టు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ మూసివేత ఈ నెలంతా కొనసాగుతుంది.

షిరిడీ సాయి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రసాదాలయ, భక్తనివాస్ ప్రాంగణాల్ని కూడా పూర్తిస్థాయిలో మూసివేశారు. బాబా దర్శనం కోసం వస్తున్న భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నామని.. దయచేసి ఈనెలంతా భక్తులెవ్వరూ ఆలయానికి రావొద్దని సంస్థాన్ విజ్ఞప్తి చేస్తోంది.

అయితే ఆలయం మూసేసినా, బాబాకు రోజూ జరిగే పూజాదికాలన్నింటినీ లాంఛనంగా జరిపిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. ఆలయ పూజారులు రోజువారీ జరిగే పూజల్ని యథావిథిగా కొనసాగిస్తారని.. పూజారులకు ప్రతి 3 రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. 

పూజలను ప్రత్యక్ష ప్రసారం చేసే కార్యక్రమం కూడా నిరంతరం కొనసాగుతుందని ట్రస్ట్ స్పష్టంచేసింది. మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పూణె లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ విధించారు. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,03,794 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. వీటిలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. తాజా కేసులతో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిలిచింది మహారాష్ట్ర.