ఈ ‘పచ్చ’ రాతలు మారవా

పెరిగిన విద్యుత్ చార్జీలు ప్రజల నడ్డి విరుస్తున్నాయట. ముఖ్యమంత్రి జగన్ మధ్యతరగతి జేబుకు చిల్లు పెడుతున్నారట. చార్జీలు పెంచి, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారట. Advertisement తాజాగా పెంచిన విద్యుత్ చార్జీలపై పచ్చ రాతలు…

పెరిగిన విద్యుత్ చార్జీలు ప్రజల నడ్డి విరుస్తున్నాయట. ముఖ్యమంత్రి జగన్ మధ్యతరగతి జేబుకు చిల్లు పెడుతున్నారట. చార్జీలు పెంచి, ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారట.

తాజాగా పెంచిన విద్యుత్ చార్జీలపై పచ్చ రాతలు ఇలా విచ్చలవిడిగా సాగుతున్నాయి. పెన్నుకు ఏదొస్తే అది రాయడం, మైండ్ లో ఏది తడితే అది చూపించడం పనిగా పెట్టుకున్నాయి చంద్రబాబు పత్రికలు, ఛానెళ్లు. నిజంగానే పెరిగిన విద్యుత్ చార్జీలు పేదోళ్లకు భారమా.. మధ్యతరగతి జనాలకు కష్టమా.. ఈ విశ్లేషణను మాత్రం కావాలనే పక్కన పెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెరిగాయి నిజమే. యూనిట్ కు 90 పైసలు పెంచారు ఇది కూడా నిజమే. కానీ దీని వెనకున్న అసలు విషయాన్ని మాత్రం పచ్చ పత్రికలు చెప్పడం లేదు. 500 యూనిట్లు దాటి వాడిన వినియోగదారులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్య జనాలు, ఇంకా చెప్పాలంటే ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా నెలకు 500 యూనిట్లు కాల్చరు. కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్ పై మాత్రమే ఈ భారం పడుతుంది.

ఈ విషయాన్ని మాత్రం పచ్చ పత్రికలు చెప్పవు. ఎల్లో ఛానెల్స్ చూపించవు. సామాన్యుల నడ్డి విరిగిపోతోందంటూ హెడ్డింగ్స్ మాత్రం పెడతారు. దీనిపై దేవినేని ఉమ లాంటి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని మొసలికన్నీరు కారుస్తున్నారు ఉమ. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచినట్టుగానే, ఈసారి విద్యుత్ చార్జీలు పెంచారట. ఈ విషయంలో మాత్రం దేవినేని కరెక్ట్ గా చెప్పారు. సామాన్యుడిపై భారం పడకుండా ఆర్టీసీ చార్జీలు పెంచారప్పుడు. మధ్యతరగతి వినియోగదారుడిపై భారం పడకుండా విద్యుత్ చార్జీలు పెంచారిప్పుడు. ఈ విషయాన్ని మాత్రం దేవినేని ఉమ లాంటి టీడీపీ నేతలు మరిచిపోతున్నారు.

కాసేపు ఈ సంగతి పక్కనపెడదాం.. ఐదేళ్లు వెనక్కి వెళ్దాం. 2015లో దాదాపు ఇదే సమయంలో (ఫిబ్రవరి-మార్చి) చంద్రబాబు కూడా విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు జగన్ 500 యూనిట్లు దాటినప్పుడు మాత్రమే చార్జీ పెంచితే, గతంలో 200 యూనిట్లకే చార్జీల మోత మోగించారు బాబు. అప్పుడు ఇవే పత్రికలు ఏం రాశాయో చూద్దాం..?

పెరిగిన విద్యుత్ చార్జీలు.. సామాన్య-మధ్య తరగతికి ఊరట.. 92శాతం మందికి ఉమశమనం.. 8శాతం మందిపై మాత్రమే భారం.

చూశారుగా.. 200 యూనిట్లపై చార్జీలు పెంచితేనే 92శాతం మందికి ఉపశమనం అంటూ అప్పట్లో రాసిన ఇవే పత్రికలు.. ఇప్పుడు 500 యూనిట్లు దాటిన వాళ్లకు రేటు పెంచితే.. సామాన్య జనాల నడ్డివిరుస్తున్న జగన్ అంటూ హెడ్డింగ్ లు పెట్టారు. పచ్చరాతల పరాకాష్టకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి.

జగన్ ఏ పనిచేసినా దానిపై విషపు రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నాయి కొన్ని పత్రికలు. మంచి పనిని కూడా చెడుగా చూపిస్తూ విషాన్ని ఎక్కించడమే పనిగా పెట్టుకున్నాయి మరికొన్ని వార్తా ఛానెల్స్. అభివృద్ధి, సంక్షేమం పైనే పూర్తిగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి.. ఇలాంటి రాతల్ని, ఛానెళ్లను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కాబట్టి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. పచ్చరాతల్ని తిప్పికొట్టాలి.