‘తెలంగాణకు లక్షన్నర కోట్లు ఇచ్చాం’ ‘ఆంధ్రప్రదేశ్‌కు రెండు లక్షల కోట్లు ఇచ్చాం..’ ఏరాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చాం.. ఇలా ఇచ్చాం ఇచ్చాం అంటూ చెప్పుకోవడం పెద్ద ఫ్యాషనైపోయింది. రాష్ట్రాలు తమ తమ సమస్యలను ఏకరవు పెడుతున్నప్పుడెల్లా కేంద్రంలోని పెద్దలు, ప్రత్యేకించి.. ఇతర పార్టీల ఏలుబడిలో ఉండే రాష్ట్రాల విషయంలో ఇలాంటి చిలకపలుకులు పలుకుతూ ఉంటారు. అయితే సదరు కేంద్రం ఎక్కడినుంచి తెచ్చి యిస్తోంది? వారేమైనా తమ జేబులోంచి తీసుకొచ్చి ఇస్తున్నారా? అనేదే సామాన్యుడికి కలుగుతున్న సందేహం.
కేంద్రప్రభుత్వానికి ‘ఇవ్వడానికి’ నిధులు ఎక్కడినుంచి వస్తుంటాయి? అవి పూర్తిగా రాష్ట్రాలనుంచే వస్తాయి. రాష్ట్రాల పరిధిలో పనిచేసే అనేకానేక వ్యవస్థలను కూడా తమ ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా పన్నుల రూపేణా కేంద్రం సొమ్ములూ జమ చేసుకుంటుంది. సదరు సమ్ముల్లోంచి తమ జీతబత్తేలు తీసుకుని.. మిగిలిన సొమ్ముల్లో అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇలా జరగడం అవసరమే. లేకపోతే.. కేంద్రానికి పెద్ద మొత్తాల్లో నిధులు సమకూర్చలేని పేద రాష్ట్రాలు.. కనీస అభివృద్ధికి కూడా గతిలేకుండా కునారిల్లిపోయే దుస్థితి ఉంటుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‘తెలంగాణకు ఇచ్చాం’ అంటూ చెప్పుకుంటున్న ఈ లక్షన్నర కోట్లు వారేదో ఇతర రాష్ట్రాలనుంచి సమీకరించిన డబ్బును తెలంగాణకు ఉదారంగా ఇవ్వడం కాదు. అలా గని.. తెలంగాణ ద్వారా సంపాదించిన ప్రతిరూపాయీ తెలంగాణకే ఇచ్చేయాలని కూడా కాదు. ఏదో మేం ఇచ్చాం అంటూ ఊదరగొట్టడం అనవసరం అని మాత్రమే! తెలంగాణ తొలినుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రమేమీ కాదని, తొలినుంచి రెవెన్యూ మిగులులోనే ఉన్నదని తేల్చేశారు.
సరే, రెవెన్యూ మిగులులో ఉన్న రాష్ట్రానికి అదనంగా కేంద్రం చేయూత అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న నిర్మల సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఇచ్చారు. కేంద్ర పథకాల్లో న్యాయంగా ఆ రాష్ట్రానికి వాటాగా రావాల్సిన సొమ్ములు తప్ప.. వారు ఇప్పటిదాకా ఏం చేశారు? ఆ వివరాలు కూడా చెబితే బాగుండేది. కేంద్రంలోని పార్టీలు తమకు అనుకూలంగా ఉండే పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలతో ఒకరకంగా, ప్రత్యర్థి పార్టీలు పరిపాలించే రాష్ట్రాల పట్ల మరో రకంగా వ్యవహరించడం చాలా దారుణం అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
కేంద్రంసాయం గురించి నిలదీసినప్పుడెల్లా.. డొంకతిరుగుడు ప్రకటనలతో పొద్దుపుచ్చుతున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది.