హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు గడిచిపోయాయి. డైరెక్ట్ తెలుగు తొలి సినిమాలో తన క్యూట్ నెస్ తో తెలుగు వాళ్లను కట్టిపడేసి.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది సమంత. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్ అయ్యింది. చేతినిండా అవకాశాలు, భారీ పారితోషకం, ఆ పై ప్రేమ, పెళ్లి… పదేళ్లలో సమంత జీవితం తిరుగులేని స్థాయికి చేరింది. ఇప్పుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఆమెకు పెద్దగా లేదు. దీంతో సెలెక్టివ్ గా వెళ్తూ ఉంది.
రీమేక్ సినిమాలు చేసి తను ప్రత్యేకమైన పాత్రలు చేసినట్టుగా అనిపించుకోవాలని సమంత తపిస్తున్నట్టుగా ఉంది.జానూతో సమంత రెండో రీమేక్ ముచ్చట తీరింది. ఇక వాట్ నెక్ట్స్ అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న. ప్రస్తుతానికి అయితే సమంత చేతిలో సినిమాలు ఏవీ లేవు! లేవనడం కన్నా ఆమె కొత్తగా ఏవీ ఒప్పుకోలేదని అనాలేమో. అమెజాన్ వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సెకెండ్ పార్ట్ లో సమంత నటించబోతూ ఉంది. ఇది హిందీతో సహా ప్రాంతీయ భాషల్లో పలకరించనుంది. ఇలా సమంత వెబ్ సీరిస్ ల వైపు దృష్టి సారించినట్టుగా ఉంది. ఇక పెళ్లి కావడం, గ్లామరస్ పాత్రలు చేయాల్సిన అవసరం లేకపోవడం.. సమంత సినీ కెరీర్ ను మందగమనంలోకి పడేస్తూ ఉన్నట్టే.
పెద్దింటి కోడళ్లు అయ్యాకా కొంతమంది హీరోయిన్లు సినిమాలకు పూర్తిగా దూరం అవుతారు కూడా. అయితే సినీ కుటుంబానికే కోడలు కావడంతో సమంత సినిమాలతో టచ్‌లోనే ఉండటం పెద్ద విశేషం కాదు. హీరోయిన్ గా నటించేంత స్వతంత్రాన్నీ భర్త ఇచ్చాడు. ఆ సంగతులన్నీ అలా ఉంటే.. సమంతలో మునుపటి గ్లామర్ టచ్ తగ్గిందనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. అందుకే సమంత తెలివిగా గ్లామరస్ రోల్స్ నుంచి తప్పుకుంటోందా!