కేఎస్ రవి కుమార్.. ఒకనాడు వరస సూపర్ హిట్లతో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు. ఇప్పటికీ ఆయన రేంజ్ స్టార్ హీరోలే. అయితే సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో బాలకృష్ణతో వరసగా రెండు సినిమాలు చేశాడు కేఎస్. అయితే ఇవి కేఎస్ గత చిత్రాలతో పోలిస్తే.. విసిగెత్తించాయి. రెండో సినిమా అయితే కనీసం వాల్ పోస్టర్ల ఖర్చును కూడా వసూలు చేయలేకపోయిందని అంటారు. ఇలా కేఎస్ రవి కుమార్ దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఒకనాడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇలా ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్లాప్ లను ఇచ్చి.. తన రేంజ్ ను చాలా తగ్గించేసుకున్నాడు. సగటు ప్రేక్షకుడి దృష్టిలో కేఎస్ రవికుమార్ ఇలా ఔట్ ఫామ్ సినిమాలతో అంచనాలు తగ్గిపోయి ఉండగా, ఈ దర్శకుడిపై రూమర్లు మాత్రం ఆసక్తిదాయకమైన స్థాయిలో వస్తున్నాయి.
అందులో ఒకటి అజిత్ తో కేఎస్ రవికుమార్ తదుపరి సినిమా చేయబోతున్నాడనేది. బాలకృష్ణతో డిజాస్టర్ ను తీసిన ఈ దర్శకుడికి అజిత్ ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడంటే మాటలు కాదు. ఫామ్ లో లేని, ఔట్ డేటెడ్ దర్శకుడితో ఊపు మీదున్న స్టార్ హీరో సినిమా చేయడం అంటే మాటలు కాదు కదా! ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇది రూమర్ మాత్రమే. ఈ విషయాన్ని కేఎస్ రవికుమార్ స్వయంగా ధ్రువీకరించాడు. అజిత్ తో తను సినిమా చేయబోవడం అనేది కేవలం రూమర్ మాత్రమే అని ఆయన చెప్పారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నాడు. గతంలో అజిత్-కేఎస్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ హిట్ కావడం గమనార్హం.