ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో తెలుగుదేశం పార్టీలో చీలిక కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఎంపీ కేశినేని నాని ఒక రకంగా స్పందించారు. ఇక ఆయన సస్పెన్షన్ విషయంలో మాజీ మంత్రులు చిన్నరాజప్ప, యనమల మరో రకంగా స్పందించారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను స్వాగతించినట్టుగా మాట్లాడారు కేశినేని నాని. తమ పార్టీ ఓటమికి ఏబీవీ నే కారణం అని, ఆయనను సస్పెండ్ చేసి జగన్ తప్పు చేశారన్నట్టుగా కేశినేని మాట్లాడారు.
అలా ఏబీవీ విషయంలో కేశినేని అక్కసు వెల్లగక్కారు. అంతా సానుకూలంగా ఉందని చంద్రబాబుకు నివేదికలు ఇచ్చి తమను పప్పులో కాలు వేయించారనేది కేశినేని అక్కసు కాబోలు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఏబీవీని గట్టిగా వేనకేసుకు వచ్చారు యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప. అధికారులపై ఇది కక్ష సాధింపు అని వీరు అంటున్నారు. ప్రభుత్వోద్యుగులపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని..యనమల చెప్పుకొచ్చారు.
ఇది భలే ఉంది! ప్రభుత్వ అధికారులు అయిన మాత్రాన వారు అన్నింటికీ అతీతులా? వారు తప్పులు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండాలా? అక్రమాలకు పాల్పడినా వారిని భరించాలి తప్ప.. చర్యలు తీసుకోకూడదా? ఇదేనా తెలుగుదేశం పార్టీ వాదన. మరి ఈ వాదన కేవలం చంద్రబాబుకు అతి సన్నిహితంగా మెగిలిన ఏబీ వెంకటేశ్వరరావు కు మాత్రమే చెల్లుతుందా? లేక ప్రభుత్వాధికారులందరి విషయంలోనూ టీడీపీ ఇదే అభిప్రాయంతో ఉందో!