దర్భార్ సినిమా కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపు 108 కోట్ల రూపాయలు! పింక్ రీమేక్ కోసం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ దాదాపు 50 కోట్ల రూపాయలు! మహేశ్ బాబు రెమ్యూనరేషన్ ఏమీ తక్కువ కాదు, తన సినిమాల విషయంలో మహేశ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నాడని, అది నలభై కోట్ల రూపాయలకు పై మాటే అని ఇండస్ట్రీలో వినిపించే టాక్. వీరు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోల పారితోషకాలు ఆకాశాన్ని అంటుతున్నాయనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
సినీ పరిశ్రమలు మొదటి నుంచి మేల్ డామినెంట్ ఇండస్ట్రీలే. అందునా హీరోలు చెప్పిందే అక్కడ జరుగుతుంది. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలదే అగ్రతాంబూలం. ఇది దశాబ్దాల నుంచి నడుస్తున్న కథే. ఇప్పుడూ అదే నడుస్తూ ఉంది. అయితే.. ఇప్పుడు పతాక స్థాయికి వెళ్లిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
యాభై శాతం బడ్జెట్ హీరోల రెమ్యూనరేషనేనా?
దర్భార్ సినిమానే ఉదాహరణగా తీసుకుంటే.. అందులో హీరో రెమ్యూనరేషన్ మాత్రమే హీరో రెమ్యూనరేషన్ లో సగ భాగం అనే టాక్ వచ్చింది. దాదాపు 220 కోట్ల రూపాయలతో ఆ సినిమా రూపొందిందని.. అందులో 108 కోట్ల రూపాయలు రజనీకాంత్ రెమ్యూనరేషన్ గానే వెళ్లిపోయాయని వార్తలు వచ్చాయి. ఇలా చూస్తూ దాదాపు 50 శాతం డబ్బు కేవలం హీరో రెమ్యూనరేషనే. ఆ సినిమా మార్కెట్ మొత్తం రజనీకాంత్ పేరు మీదే సాగి ఉండొచ్చు. కానీ సినిమా అనేది ఎంత కాదన్నా టీమ్ వర్క్. అలాంటి పరిశ్రమలో హీరోలు బడ్జెట్ లో 50 శాతం మొత్తాన్ని రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటున్నారనే టాక్ ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
తేడా వచ్చినప్పుడే రచ్చ!
ఏ సినిమా అయినా హిట్ అయితే.. ఏ సమస్యా లేదు. హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, హీరోయిన్ కు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు.. అనేవి అప్పుడు లెక్కలే కాదు. సినిమా రూపొందించడానికి అయిన ఖర్చుకు మించి వసూళ్లను సంపాదించినప్పుడు, డిస్ట్రిబ్యూటర్లు లాభాలను చవి చూసినప్పుడు.. అయిన ఖర్చులో ఎంత శాతం ఎవరు తీసుకున్నారు అనేది పాయింటే కాదు. హీరో తీసకున్నాడా, నిర్మాత మిగుల్చుకున్నాడా.. అనేది అప్పుడు పాయింటే కాదు. ఎటొచ్చీ స్టార్ హీరోల సినిమాలను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినప్పుడే కథ తిరగబడుతూ ఉంటుంది.
దర్బార్ సినిమా విషయంలో అదే జరిగింది. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లకు పెట్టిన బడ్జెట్ కు సంబంధం లేదని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన ధరల్లో సగం స్థాయి వసూళ్లను కూడా ఆ సినిమా సాధించలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో రజనీకాంత్ అందుకున్న పారితోషకం ఆ సినిమా విషయంలో చర్చనీయాంశంగా మారింది. హీరో ఒక్కడే 108 కోట్ల రూపాయలు తీసేసుకున్నాడని, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరికీ కలిపినా ఆ డబ్బు కూడా రాలేదనే టాక్ నడుస్తూ ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు అంతా ఆ సినిమాను తమకు అమ్మిన నిర్మాణ సంస్థ వద్దకు వెళ్లారట. అప్పుడు వారు తాపీగా అసలు విషయాన్ని చెప్పారట. ఆ సినిమా నిర్మాణంలో సగం మొత్తం రజనీకాంత్ పారితోషకంగానే వెళ్లిందని, ఇప్పుడు తాము పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని.. వారు చేతులు ఎత్తేశారట! ఆ సినిమాతో తాము బావుకున్నది ఏమీ లేదని వారు తేల్చారట.
దర్శకులూ తక్కువ తినడం లేదు!
దర్బార్ సినిమాకు సంబంధించే మరో షాకింగ్ సీక్రెట్ ను సదరు నిర్మాణ సంస్థ బయటపెట్టిందట. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ కూడా రికార్డు స్థాయి పారితోషికం తీసుకున్నాడని ఆ సంస్థ డిస్ట్రిబ్యూటర్లకు గణాంకాలతో సహా చెప్పిందట. రజనీకాంత్ పారితోషకంగా 108 కోట్ల రూపాయలు పోయాయి, దర్శకుడు మురుగదాస్ పారితోషకం అయితే 60 కోట్లట, ఇక నయనతారా తక్కువ రేంజేమీ కాదు. స్థూలంగా హీరో-దర్శకుడి పారితోషకమే 170 కోట్ల రూపాయలు అని.. ఆ సినిమాను నిర్మించిన సంస్థ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పిందట. పరిహారం అడిగిన డిస్ట్రిబ్యూటర్లకు తమ చేతిలో ఏమీ లేదని, మొత్తం డబ్బంతా రజనీ-మురుగలకు వెళ్లిపోయిందని తేల్చి చెప్పిందట ఆ సంస్థ. పరిహారం కావాలంటే వారినే అడగాలని తేల్చిందట!
చాలా సినిమాల పరిస్థితి ఇదే!
ఇండస్ట్రీలో హీరోల స్వామ్యం నడుస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది హీరోలు భారీ రెమ్యూనరేషన్లను డిమాండ్ చేసి తీసుకుంటున్నారని టాక్. అది మొత్తం సినిమా బడ్జెట్ లో సగం స్థాయికి చేరిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇచ్చే వాళ్లు ఉన్నారు కాబట్టే వారు తీసుకుంటున్నారనేది మరో నిష్టూర సత్యం. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే తప్ప ప్రేక్షకులు చూసేలా లేరు, థియేటర్లు దొరకలన్నా, సినిమాకు బజ్ రావాలన్నా స్టార్ హీరోలతోనే సినిమాలు తీయాలి. కాబట్టి.. వారు కోరినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారనేది ఇండస్ట్రీలో పరిస్థితిని ఎరిగిన వారు చెబుతున్న మాట. ఇక్కడ మరో తిరకాసు ఏమిటంటే.. హీరోలకు ఎంత ఇచ్చినా నిర్మాతలకు పోయేదేం లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
హీరోలకు భారీ పారితోషకాన్ని ఇచ్చి, సినిమాను తక్కువ మొత్తంలో చుట్టేసి..ఆ సినిమాలను డిస్ట్రిబ్యూటర్లకు హోల్ సేల్ గానో, రీటైల్ గానో అమ్మేసి.. చేతులు దులుపుకుంటున్నారట కొందరు నిర్మాతలు. హీరోలకు అందేది హీరోలకు అందుతుంది, దర్శకులు తమకు కావాల్సినంతా అడిగి తీసుకుంటారు, వారి పేరు చెప్పి నిర్మాత భారీ ధరలకు సినిమాను అమ్మేస్తాడు. అలాంటి సినిమాల్లో హిట్ అయ్యేవి నూటికి పది! ఆ పది సినిమాలకూ డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు పొందుతారు. మిగతా వాటి కథ అంతే. డిస్ట్రిబ్యూటర్లు తలా కొంచెం డబ్బులు నష్టపోతారు. ఇదే ఇండస్ట్రీ మనుగడకు కీలకం అవుతోందనేది ఒక విశ్లేషణ.
హీరోలకు అంత భారీ మొత్తాల పారితోషికాలు ఇచ్చి, దర్శకులకు ఆ రేంజ్ రెమ్యూనరేషన్లు ఇచ్చి.. హీరోయిన్లకూ భారీ మొత్తాలు ఇచ్చి.. తీరా సినిమా పోతే ఒకరే నష్టపోయే పరిస్థితి ఉంటే కథ వేరేలా ఉండేది. అయితే ఇప్పుడు ఒక సినిమా పోతే ఒకరికే నష్టం ఉండదు. కొన్న వారంతా తలా కొంత పోగొట్టుకుంటారు. ఆ మాత్రం నష్టాలకు తట్టుకునే వారే వారిలో చాలా మంది ఉంటారు. దీంతో హీరోల, దర్శకుల, నిర్మాతల ఆటలు ఎంచక్కా సాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
హీరోలకు ఒక సారి వచ్చిన స్టార్ డమ్ మరీ వరస ఫ్లాఫులు వస్తే తప్ప పోదు. రజనీకాంత్ సరైన హిట్ కొట్టి చాలా అవుతోంది. శ్రీమంతుడు తర్వాత మహేశ్ ఆ స్థాయిలో అలరించలేదు. ఒకరని కాదు.. స్టార్ హీరోలు ఒక్క హిట్ కొడితే మళ్లీ మినిమం మూడు ఆకట్టుకోని సినిమాలు తీసినా నష్టం ఏమీ లేదనే పరిస్థితి ఉందిప్పుడు. ఇలాంటి నేపథ్యంలో.. వారి ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల ప్రభావం పడటం లేదు. అప్పుడప్పుడు మాత్రం కొంందరు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డుకు ఎక్కుతుంటారు. తాము రజనీకాంత్ వల్ల నష్టపోయినట్టుగా, పవన్ కల్యాణ్ సినిమాతో నష్టపోయినట్టుగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు టెంట్లు వేసుకోవడాన్ని అంతా గమనించే ఉంటారు. అలా ఒకరిద్దరి ఆవేదన ఆరణ్య రోదనే అవుతూ ఉంది. ఇండస్ట్రీలో అలా నష్టపోయిన వారిని పట్టించుకునే వారు ఉండరు. ఇక హీరోల కనుసన్నల్లో మొత్తం నడుస్తుంది కాబట్టి.. సదరు సినిమాల కలెక్షన్స్ విషయంలో కూడా హీరోలు చెప్పే నంబర్లే బయటకు వస్తాయి తప్ప, అసలు గుట్టు బయటకు వచ్చే అవకాశమే లేకపోవచ్చు.
అయితే ఏదైనా ఒక దశ మాత్రమే. వంద కోట్ల రూపాయల నష్టాలను చూసే సినిమా కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లను తలా ఐదో వంతో పదో వంతు మాత్రమే నష్టపరుస్తూ ఉండవచ్చు. దీని వల్ల డిజాస్టర్ల ప్రభావం ఒకరి మీదే పడకుండా ఒక్కోరిని కొంత నష్టపరుస్తూ ఉండచ్చు. ఒకసారి నష్టపోయిన వారు తెరమరుగు అయిపోయి, మరో సినిమాకు మరెవరో ఉత్సాహవంతులు స్టార్ హీరోల సినిమాలను కొంటూ ఉండవచ్చు. అదో సైకిల్ లా కొనసాగుతూ ఉండవచ్చు. ఇలాంటి అవకాశంలో సినిమాల హిట్టూ ఫ్లాపులతో నిమిత్తం లేకుండా రూపాయి మారకంతో డాలర్ విలువ పెరిగినట్టుగా సినిమా సినిమాకూ హీరోలు రెమ్యూనరేషన్ పెంచేస్తూ పోవచ్చు. కానీ ఏదైనా అతిగా పెరిగితే విరుగుతుందని పెద్దలు ఎప్పుడో హెచ్చరించారు!