ఎక్కడా తగ్గొద్దంటున్న జగన్

సామాజిక పింఛన్లు, రేషన్ కార్డుల విషయంలో కొన్ని నియమ నిబంధనలు కొంతమందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అర్హులా, అనర్హులా అనే విషయం పక్కనపెడితే వేలమందికి పింఛన్లు ఎగిరిపోయాయి, రైస్ కార్డుల్లో భారీగా కోత పడింది.…

సామాజిక పింఛన్లు, రేషన్ కార్డుల విషయంలో కొన్ని నియమ నిబంధనలు కొంతమందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అర్హులా, అనర్హులా అనే విషయం పక్కనపెడితే వేలమందికి పింఛన్లు ఎగిరిపోయాయి, రైస్ కార్డుల్లో భారీగా కోత పడింది. ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా కూడా దీనిపై నానా రాద్ధాంతం చేస్తోంది.  స్థానిక సమరం ముందు పెట్టుకుని ఇలాంటి గొడవ ఎందుకంటూ వైసీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు కూడా గోల చేస్తున్నారు.

300 యూనిట్ల కరెంటు వాడకం, కుటుంబంలో ఐటీ రిటర్న్స్ కట్టే వ్యక్తులుండటం.. వంటి నియమాలు సడలించాలని ఒత్తిడి తెస్తున్నారు కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలక సంఘాల ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో పార్టీకి నష్టం కలుగుతుందని  చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు, మంత్రుల ద్వారా ఈ విషయం జగన్ వరకూ వెళ్లిందట. ఎన్నికలొస్తున్నాయి కదా, గ్రామాల్లో ఇలాంటి అసంతృప్తి ఉంటే బాగుండదు కదా అని వివరించారట.

అయితే ముఖ్యమంత్రి మాత్రం రూల్ ఈజ్ రూల్ అని చెప్పారట. అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడం ఎంత ముఖ్యమో.. అనర్హులను ఆ జాబితా నుంచి తొలగించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారట. టీడీపీ ప్రభుత్వంలో అనర్హులకే పెద్దపీట వేశారని, వేల కోట్ల రూపాయలు వృథా చేశారని వైసీపీ హయాంలో ఇలాంటి అక్రమాలకు చోటు లేదని అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ జగన్ చెబుతూనే వస్తున్నారు. రివర్స్ టెండరింగ్ తో కాంట్రాక్ట్ పనుల్లో జరిగిన అవినీతిని ప్రక్షాళణ చేస్తున్నారు, ఇప్పుడు అన్నీ ఉన్నా నిరుపేదల లిస్ట్ లో ఉన్న వారిని ఏరివేస్తున్నారు.

స్థానికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ, దీర్ఘకాలికంగా ఇలాంటివాటితో మంచి ఫలితాలు వస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ నిర్ణయంతో కొద్దిమంది నకిలీ లబ్ధిదారులు ఇబ్బంది పడినా.. మిగతా అన్ని వర్గాల్లో ఆయన నిర్ణయానికి మంచి స్పందన వస్తోంది. ఈ తెగింపే స్థానిక సమరంలో వైసీపీకి లాభం చేకూరుస్తుందనేది అందరి మాట.

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌