సినిమాకు ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అవి కొంత వరకు బాగానే వుంటున్నాయి. కానీ ఒక్కోసారి మరీ వింతగా వుంటున్నాయి. పాటలు వదలడానికి ముందు అనౌన్స్ మెంట్..ఫలానా రోజు వస్తోందోచ్ అంటూ, ఆ తరువాత మూడు రోజులు..రెండు రోజులు అంటూ ఊరింపు, ఆఖరికి మళ్లీ ఓ పది సెకండ్లు ముక్క టీజర్ అంటూ విదిలింపు. ఆఖరికి మరో రెండు మూడు రోజులు ఆగి లిరిక్ సాంగ్, ఆపై విడియో సాంగ్..
ఇంతోటి ఒక్క పాటకు ఇంత తతంగం. సరే, పోనీ మహేష్ బాబో, ఎన్టీఆర్ సినిమానో అంటే సరే, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ వుంటుంది, త్రివిక్రమ్ నో, కొరటాల శివనో అంటే ఆసక్తి వుంటుంది అనుకోవచ్చు. నితిన్ సినిమాకు, వెంకీ కుడుమల సినిమాకూ ఇలా చేయడం ఏమిటో?
భీష్మ సినిమాలో రెండు పాటలు చకచకా వదిలారు. సింగిలే అన్న సాంగ్, వాటే వాటె వాటె బ్యూటీ సాంగ్స్ బాగానే రీచ్ అయ్యాయి. మళ్లీ మరో పాట అన్నపుడు కాస్త వినడానికో, అసలు పాట ఎలా వుందో తెలుసుకోవడానికో వీలయ్యేలా వదిలితే ఆసక్తిగా వుంటుంది. అలా కాకుండా, జస్ట్ 17 సెకెండ్ల బిట్ వదిలారు.
'సరాసరి గుండెల్లో దించావె..మరీ మరీ మైకంలో ముంచావె..అయినా సరే ఈ బాధ బాగుందే''.
అనే మూడు ముక్కలు తప్ప అందులో లేదు. దీనికి విడియో గ్లిమ్ప్స్ అనే పేరు. దీని వల్ల ఏం ప్రయోజనం ఆశించినట్లో? ఏం ప్రచారం ఆశించినట్లో? యూ ట్యూబ్ లో కాసిన్ని హిట్ లు తప్ప సినిమాకు ఒరిగేదీ వుండదు. అదే కనుక కనీసం పల్లవి, ఓ చరణం వదిలినా కాస్త ఆసక్తిగా వుంటుంది. సినిమాకు ప్రచారం వస్తుంది. కానీ అలా చేయడానికి మళ్లీ మరో ముహుర్తం. దానికి తొమ్మిది టోటల్ వచ్చేలా హడావుడి.
ఈ ముచ్చట కొన్నాళ్లు. మళ్లీ తరవాత ఎవరో ఏదో కనిపెడతారు. ఆ దారి పడతారు.