క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.వల్లభ నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14న ప్రేమికుల దినాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కేథరిన్ నటించారు. సినిమా విడుదల నేపథ్యంలో కేథరిన్ తన మనసులో విషయాలను మీడియాతో పంచుకున్నారు.
సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తాను సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు. సినిమాల కోసం సినిమాలన్నట్టు కాకుండా…కథ నచ్చితేనే అంగీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే చేసిన పాత్రనే మళ్లీ చేయడం తనకు అసలు ఇష్టం లేదని చెప్పారామె. నచ్చిన కథలు రాకపోవడం వల్లే మధ్యలో తనకు కొంత గ్యాప్ వచ్చినట్టు కేథరిన్ తెలిపారు.
ప్రేమపై తనకు మంచి అభిప్రాయం ఉందని చెప్పారామె. అదొక మానసిక ఎమోషన్ అని తెలిపారు. కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్నదే ప్రేమ కాదని అన్నారామె. స్నేహితులు, కుటుంబ సభ్యులందరి మధ్య ఉన్నది కూడా ప్రేమే అని కేథరిన్ బలంగా చెప్పారు. తాను అలాంటి ప్రేమను గౌరవిస్తానని చెప్పారు. ఇక సహజీవనం విషయానికి వస్తే…అది అందరికీ సరిపడక పోవచ్చని అభిప్రాయపడ్డారు. స్ర్తీ, పురుషుల మధ్య జరిగే జీవిత కాల ఒప్పందమే పెళ్లి అని కేథరిన్ చెప్పారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని గౌరవిస్తానని కేథరిన్ తెలిపారు.
ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయానికి వస్తే తన క్యారెక్టర్ పేరు స్మిత అని, మోడ్రన్‌గా, మెచూర్డ్‌గా ఉండే అమ్మాయిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు హీరోయిన్‌లతో తనకు కాంబినేషన్ సీన్స్ లేవన్నారు. విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుందని, ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కథేనన్నారు.
‘నేనొక సినిమా చేశానంటే నా నటన సినిమాకు బలం కావాలి. కానీ తగ్గించేలా ఉండకూడదు. నా వల్ల ఫలానా సీన్ చెడిపోయిందని నా చెవిన పడితే అసలు తట్టుకోలేను. ఇప్పటి వరకూ ఐతే అలాంటి సిచ్చువేషన్ ఎదురుకాలేదు’ అని కేథరిన్ విలేకరుల సమావేశంలో అనేక ముచ్చట్లు చెప్పుకుపోయారు.