మహర్షి సినిమాలో రైతు సమస్యలు, పంటలు గురించి చర్చించాడు మహేష్. దాదాపు ఇదే స్టోరీలైన్ తో శ్రీకారం అనే సినిమా వస్తోందనే టాక్ ఉంది. దీనిపై శర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు. రాత్రి మీడియాతో మాట్లాడిన శర్వ.. మహేష్ మూవీకి తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు.
“ఇంతకుముందు రైతుల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకు దీనికి సంబంధం లేదు. రైతు సమస్యలు, గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ పాలసీలు లాంటి ఇష్యూస్ మేం టచ్ చేయలేదు. అంతా అనుకుంటున్నట్టు సేంద్రియ వ్యవసాయం గురించి కూడా చెప్పడం లేదు. మనకే ఒక ఎకరం ఉంటే ఏం చేస్తాం, దాన్ని కౌలుకు ఇచ్చి టౌన్ కు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది అనే పాయింట్ ను చర్చిస్తున్నాం.”
ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అవుతున్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. రైతు కొడుకు రైతు ఎందుకు అవ్వకూడదనే పాయింట్ ను బేస్ చేసుకొని శ్రీకారం మూవీ చేస్తున్నామన్నాడు శర్వానంద్. తమది కూడా రైతు కుటుంబమే కావడంతో స్టోరీకి కనెక్ట్ అయ్యాని చెబుతున్న శర్వా… వ్యవసాయం నేపథ్యంలో సాగే తండ్రికొడుకుల కథగా శ్రీకారం మూవీ వస్తుందని స్పష్టంచేశాడు.
“వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో తండ్రికొడుకుల బంధాన్ని ఈ సినిమాలో చెబుతున్నాం. కొడుకొచ్చి వ్యవసాయం చేస్తుంటే, నిన్ను చదివించింది ఇందుకా అని తండ్రి ప్రశ్నిస్తాడు. చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చెబుతున్నాం. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ తో పాటు మంచి ఎమోషన్స్ ఉండే జెన్యూన్ సినిమా ఇది.”
తమ కుటుంబం సపోటా, వరి, మామిడి సాగు చేస్తుందని అన్నాడు శర్వానంద్. తమకు 8 ఆవులు కూడా ఉన్నాయంటున్నాడు. టైమ్ దొరికినప్పుడు తను కూడా వ్యవసాయం చేస్తుంటానని చెబుతున్నాడు.