ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. పోలింగ్ మందకొడిగా సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ప్రముఖులు అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. హీరోయిన్ తాప్సీ కూడా ఢిల్లీలో ఓటు వేసింది. కుటుంబంతో సహా వెళ్లి తాప్సీ ఓటు హక్కును వినియోగించుకుని ఫొటోను ట్వీట్ చేసింది. పన్ను ఫ్యామిలీ ఓటేసిందని, ఢిల్లీ ఓటర్లు కదిలిరావాలని ఆమె పిలుపునిచ్చింది.
ఆ సంగతలా ఉంటే.. ఢిల్లీలో అప్ విజయం మీద బెట్టింగులు కొనసాగుతూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధిస్తుందని సత్తా బజార్ అంటోందట. భారీ ఎత్తున బెట్టింగులు జరిగే అక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మీద కూడా బెట్టింగులు సాగుతూ ఉన్నాయట. వాటి ప్రకారం.. గెలుపు గుర్రం ఆమ్ ఆద్మీ పార్టీనే అని తెలుస్తోంది. బీజేపీ వాళ్లు ఢిల్లీలో గట్టిగానే ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ప్రచారం అంతా అయిపోయి, ఇప్పుడు ఓట్లు పడుతూ ఉన్నాయి.
ఇక ప్రచారం చివరి రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ఒక వ్యాఖ్య పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీకి ఢిల్లీలో 45 సీట్లు వస్తాయని షా చెప్పుకొచ్చారు. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో 45 సీట్లు తమవే అని ఆయన ప్రకటించుకున్నారు. అలా అమిత్ షానే తమ రేంజ్ 45 సీట్లే అని తేల్చారు.
ఆ నంబర్ మినిమం మెజారిటీ కన్నా ఎక్కువే కావొచ్చు. కానీ.. స్వయంగా బీజేపీ పెద్ద దిక్కుల్లో ఒకరైన అమిత్ షానే అక్కడ తమ పార్టీకి వచ్చేది 45 సీట్లే అన్నారంటే.. వాస్తవం ఇంకెలా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది. వందకు వంద శాతం సీట్లను సాధిస్తామని నేతలు ప్రకటించుకున్నప్పుడే.. వచ్చే మెజారిటీలు బోటాబోటీగా ఉంటాయి. అలాంటి షా ప్రకటించింది కేవలం 45 సీట్లే. ఇంతకీ ఢిల్లీలో బీజేపీకి వచ్చేవెన్నో, అసలు ఫలితాలు ఎలా ఉంటాయో.. మరో మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.