‘A’ సర్టిఫికెట్ సినిమా ప్రదర్శనతో సమాజానికి ఎలాంటి సందేశాన్ని పంపుతారని, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ సినిమాను గుంటూరులో ప్రదర్శించవద్దని బాలీవుడ్, టాలీవుడ్ థియేటర్ల వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ కాలేజీని ఒక విద్యాలయంగా కాకుండా అశ్లీలతకు నిలయంగా ట్రైలర్‌లో దర్శకుడు చూపారన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విలువలకు తిలోదకాలు ఇస్తూ దర్శకుడు, నిర్మాతలు తరగతి గదుల్లో అశ్లీల దృశ్యాలను చిత్రీకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమన్నారు. మరోవైపు జగన్ సర్కార్ దిశ చట్టాన్ని అమలు చేస్తామని చెబుతోందని, అలాంటప్పుడు ఇలాంటి సినిమాల ప్రదర్శనకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.