ఏపీ రాజధాని అమరావతికి మద్దతు కోరుతూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి ఐకాస, విద్యార్థులు శనివారం ధర్నా నిర్వహించారు. అయితే ఇక్కడో విషయాన్ని ధర్నా నిర్వాహకులు గుర్తించాలి. సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశీయుల పాత్ర కీలకమైంది. నందమూరి ఇంటి అల్లుళ్లే నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్. అందువల్ల అమరావతికి ముందుగా వాళ్ల నుంచి ఎందుకు మద్దతు తీసుకురాలేకున్నారు.
నిజంగా అమరావతి ఐకాస, విద్యార్థులకు చిత్తశుద్ధి, దమ్ము ఉంటే ‘నందమూరి’ హీరోలైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లెదుట ధర్నా చేయాలి. ఇప్పటి వరకు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ అమరావతికి మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. రాయలసీమలోని హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండటంతో మౌనం పాటించాడు. బాలకృష్ణ పార్టీ రాయలసీమను విస్మరించడంతో ఇటీవల ఆయన్ను హిందూపురంలో చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా తనదైన సినిమా ప్రపంచానికి పరిమితమయ్యాడు.
చంద్రబాబు బామ్మర్ది, లోకేశ్ మామ అయిన బాలకృష్ణతో అమరావతికి మద్దతుగా ఎందుకు ప్రకటన ఇప్పించలేకపోయారు. తాజాగా శనివారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన ధర్నాలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదు. టీడీపీ అనధికార ప్రతినిధి రామకృష్ణను ఎందుకు పంపాల్సి వచ్చింది? తమ కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వకపోతే, మిగిలిన సినిమా నటులు ఎందుకు ఇస్తారు?
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో అమరావతికి మద్దతుగా ప్రకటన ఇప్పించాలని మహా కమ్యూనిస్టు నాయకుడైన రామకృష్ణ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఎందుకంటే బాబుకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయడం రామకృష్ణ ఉద్యోగమా? జనం చూస్తున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా చేస్తే…అభాసుపాలు కావడం తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు.