అలీ లేకుండా తను సినిమా చేయలేనని గతంలో ప్రకటించాడు పవన్. తన పాకెట్ లో ఎప్పుడూ పవన్ ఫొటో ఉంటుందని చెప్పుకొచ్చాడు అలీ.
వీళ్లిద్దరి మధ్య స్నేహబంధాన్ని చెప్పడానికి ఈ రెండు స్టేట్ మెంట్స్ చాలు. ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాల్లొచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టారు. వీటిలో 2 సినిమాలు ఆల్రెడీ సెట్స్ పైకి కూడా వచ్చేశాయి. మరి అలీ సంగతేంటి.. పవన్ సినిమాల్లో అలీ ఉన్నాడా లేడా?
పవన్-దిల్ రాజు కాంబోలో వస్తున్న వకీల్ సాబ్ సెట్స్ పైకి వచ్చేసింది. ఇందులో అలీ ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ మార్క్. అటు పవన్-క్రిష్ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చింది. ఇందులో కూడా అలీ ప్రజెన్స్ పై క్లారిటీ లేదు. ఈ రెండు సినిమాల సంగతి పక్కనపెడితే.. పవన్-హరీష్ శంకర్ సినిమాలో మాత్రం అలీ తప్పకుండా ఉండే ఛాన్స్ ఉంది. గతంలో పవన్ తో హరీష్ తీసిన గబ్బర్ సింగ్ లో అలీ చేసిన సాంబా క్యారెక్టర్ సూపర్ హిట్టయింది. సో.. అలాంటి ట్రాక్ ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
రాజకీయంగా పవన్-అలీ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆమధ్య పవన్ ఏదో అనడం, దానికి అలీ తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం అలీ కొనసాగుతున్న వైసీపీకి, పవన్ జనసేన పార్టీకి మధ్య ఓ రేంజ్ లో రాజకీయ శత్రుత్వం నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అనేది అనుమానాస్పదం.
పవన్ సినిమాల్లో కనిపించడానికి అలీకి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. తన వద్దకు అలాంటి ఆఫర్ వస్తే అలీ తిరస్కరించే అవకాశాలు చాలా తక్కువ. కానీ పవన్ మాత్రం అలీకి ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. ఒకవేళ పవన్-అలీ కలిసి నటిస్తే.. వాళ్లిద్దరి సన్నివేశాలు పొలిటికల్ గా టార్గెట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కచ్చితంగా దర్శకుడితే. కత్తిమీద సాము లాంటి ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించే దర్శకుల కంటే, మనకెందుకులే అని లైట్ తీసుకునే దర్శకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి హరీష్ శంకర్ ఏం చేస్తాడో చూడాలి.